మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి

మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 38మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై  అమరావతి ఎంపీ నవనీత్ రాణా ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే గూండాయిజం అంతం కావాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నవనీత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. బాలా సాహెబ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు హాని కలిగే అవకాశం ఉన్నందున.. వారికి వెంటనే భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దీని కంటే ముందే  రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే ఈ అంశంపై సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి, డీజీపీకి కూడా ఆయన లేఖ రాశారు. తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర సర్కారుదే బాధ్యతన్నారు. భద్రత తొలగించడమంటే భయపెట్టడమేనన్న ఆయన... సర్కారు తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.