
న్యూఢిల్లీ: దేశంలోని మరిన్ని సుదూర ప్రాంతాలకు విమానయానం అందుబాటులోకి తేవడానికి ఉడాన్5.0 ను లాంఛ్ చేశారు. ఈ కొత్త రూట్ల కోసం బిడ్స్ పిలిచే ప్రక్రియను సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మొదలెట్టింది. 20 నుంచి 80 సీట్లుండే కేటగిరీ 2, 80 సీట్ల కంటే ఎక్కువుండే కేటగిరీ 3 మాత్రమే ఈ 5 వ రౌండ్ ఉడాన్‌లో ఉంటాయని మినిస్ట్రీ ఒక ట్వీట్లో తెలిపింది. ఒరిజిన్, డెస్టినేషన్ల మధ్య దూరంపై ఈసారి ఎలాంటి పరిమితులనూ పెట్టడంలేదని పేర్కొంది. ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఇచ్చే నెట్వర్క్, ఇండివిడ్యువల్ రూట్ ప్రపోజల్స్ మాత్రమే పరిగణిస్తామని మినిస్ట్రీ ఈ ట్వీట్లో వెల్లడించింది. లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ వచ్చిన రెండు నెలల్లో ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ బిజినెస్ ప్లాన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. రూట్ అవార్డు చేసినప్పటి నుంచి 4 నెలల లోపు ఆపరేషన్స్‌ను ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రారంభించాల్సి ఉంటుందని వివరించింది.
గతంలోని రౌండ్లలో ఈ గడువు ఆరు నెలలుగా ఉండేది. ఆపరేషన్‌కు రెడీగా ఉన్న ఎయిర్‌పోర్టులు, లేదా త్వరలోనే రెడీ అయ్యే ఎయిర్‌పోర్టుల లిస్ట్‌ను స్కీములో చేర్చినట్లు మినిస్ట్రీ తెలిపింది. చాలా ప్రాంతాలలో ఉడాన్ మంచి మార్పు తీసుకొచ్చింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీని కల్పించిందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సిందియా ఒక స్టేట్మెంట్లో చెప్పారు. మెరుగైన మార్పులతో తెచ్చిన కొత్త ఉడాన్ స్కీము మొమెంటమ్‌ను పెంచుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 1000 రూట్లు, 50 అదనపు ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్ ఆపరేషన్లోకి తేవాలనే తమ టార్గెట్‌ను ఈ స్కీము దగ్గర చేస్తుందని అన్నారు.