షడ్రుచుల సమ్మేళనం…ఉగాది

షడ్రుచుల సమ్మేళనం…ఉగాది

హిందువులకు అతి ముఖ్యమైన పండుగ ఉగాది. కొత్త యుగానికి ఆరంభమైన రోజు కావడంతో ఉగాది అని పిలుచుకోవడం ఆనవాయితీ. చైత్రశుద్ద పాడ్యమి రోజు యుగం ప్రారంభమైన రోజుగా పూర్వీకులు చెప్తుంటారు. ఇక ఇదే రోజున శ్రీరాముడి పట్టాభిషేకం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోనూ ఇదే రోజున పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు.

ఉగాది రోజు నుంచే తెలుగువారికి కొత్త ఏడాది మొదలవుతుంది. ఇది తెలుగు వారి మొదటి పండుగ కావడంతో… ఈ రోజున కొత్తగా పనులు మొదలు పెడతారు. పొద్దన లేచి అభ్యంగన స్నానం చేస్తారు. తలకు నువ్వుల నూనె రాసుకొని… తలారా స్నానం చేస్తారు. ఇల్లంతా శుభ్రం చేసుకొని గుమ్మాలకు మామిడి, వేప ఆకులతో కడతారు. మామిడి ఆకులు శుభానికి సూచికగా చెప్తారు. అందుకే పండుగలతో పాటు… శుభకార్యాల్లో ఇంటిని అలంకరిస్తారు. ఇక కొత్త బట్టలు కట్టుకొని… ఉగాది పచ్చడి తయారు చేసి… ఇష్ట దైవానికి నైవేద్యం సమర్పిస్తారు.

ఇవాళ తయారు చేసే ఉగాది పచ్చడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. షడ్రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడిని స్వీకరిస్తే మంచిదని చెప్తారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదుతో కలిపి దీనిని తయారు చేస్తారు. శిశిర రుతువు వెళ్లి వసంత రుతువు వచ్చే సమయంలో వచ్చే ఉగాది రోజున ఈ పచ్చడిని స్వీకరించడం ఆయుర్వేదంగానూ మంచిదని చెప్తారు. ప్రకృతిలో వచ్చే మార్పులకు… మనం తట్టుకొని శారీరకంగా  మానసికంగా దృడంగా ఉండేందుకు ఈ ఉగాది పచ్చడి ఉపయోగపడుతుందని అంటారు. ఆరు రుచులు కలగలిపిన ఉగాది పచ్చడి…. ఏడాది పొడవునా ఎదురయ్యే కష్ట, సుఖాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని తెలియజేస్తుంది. ఉగాది పచ్చడితో పాటు బక్షాలు తయారు చేయడం పండుగ ప్రత్యేకత.

ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. కవులు, పండితులు పండుగ సందర్భంగా కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలను చెబుతారు. రుతువులు, వర్షాలు, పంటలు అన్నింటిని వివరిస్తారు. సాయంత్రం ఆలయాల్లో ప్రత్యేకంగా జరిగే పంచాగ శ్రవణం వినేందుకు ప్రజలంతా వెళ్తారు.

పకృతి గమనాన్ని అనుసరించి…. చేసుకునే పండుగలో ఉగాది అతి ముఖ్యమైనది. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ… ఆదర్శాలను ప్రతిబింబించేలా చేయటమే పండుగల పరమార్ధం.