ఆ 65 లక్షల పేర్లు వెల్లడించండి.. బిహార్ ఓటర్ లిస్ట్లో పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం

ఆ 65 లక్షల పేర్లు వెల్లడించండి.. బిహార్ ఓటర్ లిస్ట్లో పేర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీం ఆదేశం
  • ఈ నెల 19లోపు కారణాలతో పాటు బహిర్గతం చేయాలి
  • రేడియో, టీవీ, పత్రికల ద్వారా ప్రచారం కల్పించాలి
  • 22 నాటికి రిపోర్ట్‌‌‌‌ను అందజేయాలని ఆదేశం

న్యూఢిల్లీ: బిహార్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్)లో తొలగించిన 65 లక్షల మంది పేర్లను బయటపెట్టాలని ఎలక్షన్​ కమిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నెల 19లోపు వారి తొలగింపునకు కారణాలతో సహా వెల్లడించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన నివేదికను  22 నాటికి అందించాలని ఆదేశించింది. బిహార్‌‌‌‌‌‌‌‌లో ‘సర్’ను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై గురువారం సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్‌‌‌‌ సూర్యకాంత్, జస్టిస్‌‌‌‌ జోయ్‌‌‌‌మాల్యా బాగ్చి ధర్మాసనం  విచారించింది. ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితా సవరణకు తమకు అధికారాలు ఉన్నాయని పేర్కొన్నది.  తాము పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నామని, గెలిస్తే ఈవీఎంలు మంచివని, ఓడిపోతే చెడ్డవని ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. 

బూత్ ​స్థాయిలో వివరాలు ఎందుకు వెల్లడించలే?
ఓటర్ల జాబితాలో మరణించిన, వలసవెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేరని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తొలగించిన 65 లక్షల పేర్లలో 22 లక్షల మంది మరణించారని చెప్పారని, ఆ పేర్లను బూత్​స్థాయిలో ఎందుకు వెల్లడించలేదని అడిగింది. తొలగించిన వ్యక్తుల జాబితాను పార్టీలకు ఇచ్చామని, జిల్లా స్థాయిలో  వివరాలను ఇచ్చేందుకు సిద్ధమని ఈసీ తెలిపింది.

తొలగింపునకు కారణాలు సహా ప్రచురించి.. జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని కోర్టు ఆదేశించింది.  న్యూస్​పేపర్స్, రేడియో, టీవీ, ఇతర  మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం చేయాలని సూచించింది.  అన్ని పంచాయతీ భవనాలు, బ్లాక్ డెవలప్‌‌‌‌మెంట్, పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుపైనా ప్రదర్శించాలని తెలిపింది.తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. 

సవాల్​ చేసేందుకు ఆధార్​ సమర్పించొచ్చు..
ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు ఈ తొలగింపును సవాల్​ చేసేందుకు ఆధార్ కార్డును సమర్పించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ఓటర్ల జాబితా సమీక్ష కోసం ఎన్నికల సంఘం ఆమోదించిన 11 డాక్యుమెంట్లలో ఆధార్ లేదని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలు, నష్టపోతారని పిటిషనర్లు వాదించారు. దీంతో ఆధార్​అనేది వ్యక్తి గుర్తింపు, నివాసానికి చట్టబద్ధమైన  పత్రం అని, ఆధార్ ను తప్పకుండా అంగీకరించాల్సిందే అని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు.

ఓటర్ల జాబితాలో మరణించిన, వలస వెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేదు. బిహార్​ ఓటర్​ జాబితా నుంచి తొలగించిన 65 లక్షల పేర్లలో 22 లక్షల మంది మరణించారని ఈసీ చెప్పింది.. మరి ఆ 22 లక్షల మంది పేర్లను బూత్​స్థాయిలో ఎందుకు ప్రదర్శించలేదు. తొలగింపునకు కారణాలను జిల్లా రిటర్నింగ్ అధికారి ఆఫీస్, పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుపై ఉంచాలి.

సుప్రీంకోర్టు