రష్యా సైన్యంలో భారతీయుడు.. ఉక్రెయిన్ ఆర్మీకి చిక్కాడు.. యుద్ధం గురించి సంచలన విషయాలు వెల్లడి

 రష్యా సైన్యంలో భారతీయుడు.. ఉక్రెయిన్ ఆర్మీకి చిక్కాడు.. యుద్ధం గురించి సంచలన విషయాలు వెల్లడి


రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయుడు ఉక్రెయిన్ ఆర్మీకి చిక్కడం సంచలనంగా మారింది. భారత పౌరులను రష్యా తమపై యుద్ధం కోసం వాడుకుంటోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. 

గుజరాత్ మోర్బికి చెందిన మజోటి సాహిల్ మొహమద్ హుస్సేన్.. ఇటీవల ఉక్రెయిన్ బలగాలకు చిక్కాడు. దీనిపై ఉక్రెయిన్ మీడియా సంస్థలు.. భారత్ పౌరులు రష్యా ఆర్మీలో పనిచేస్తున్నట్లు ఆరోపించాయి. పై చదువుల కోసం రష్యా వెళ్లిన హుస్సేన్.. రష్యా ఆర్మీలో జాయిన్ అయినట్లు ఉక్రెయిన్ న్యూస్ ఏజెన్సీ ద కీవ్ ప్రకటించింది. దీనిపై స్పందిచిన ఇండియా.. ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని.. అధికారికంగా వివరాలు వస్తే స్పందిస్తామని విదేశాంగ శాఖ పేర్కొంది. 

బలవంతంగా యుద్ధం చేయిస్తున్నారు: హుస్సేన్

హుస్సేన్ తో వీడియో రికార్డ్ చేసి విడుదల చేసింది ఉక్రెయిన్ ఆర్మీ. ఈ వీడియోలో తనకు యుద్ధం చేయడం ఇష్టం లేదని.. రష్యా తమతో బలవంతంగా ఆర్మీలో దింపిందని పేర్కొన్నాడు. డ్రగ్ సంబంధిత కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడిన తనను.. ఆర్మీలో పని చేస్తే శిక్ష తగ్గిస్తామని చెప్పి సైన్యంలో చేర్పించినట్లు తెలిపాడు. 

జైళ్లో ఉండలేక.. తప్పించుకునేందుకే ఆర్మీలో జాయిన్ అయినట్లు చెప్పాడు హుస్సేన్. ఉక్రెయిన్ పై పూర్తిస్థాయిలో దాడి పేరున.. స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ టీమ్ లో చేర్చినట్లు చెప్పాడు. కానీ తనకు పనిచేయడం ఇష్టం లేదని.. బయటకు రావాలని ఉన్నట్లు తెలిపాడు. 

16 రోజుల మిలిటరీ ట్రైనింగ్ తర్వాత అక్టోబర్ 1న రష్యా ఆర్మీ యుద్ధంలోకి పంపినట్లు హుస్సేన్ తెలిపాడు. అయితే కమాండర్ తో తలెత్తిన వివాదంతో.. ఉక్రెయిన్ బలగాలకు కావాలని లొంగిపోయినట్లు పేర్కొన్నాడు. ఉక్రెయిన్ బలగాలకు రెండు మూడు కిలోమీటర్ల సమీపంలోకి వచ్చి.. రైఫిల్ ను కింద పడేసి.. సహాయం కావాలని చేతులు ఎత్తడంతో తనను టేకోవర్ చేసుకున్నట్లు చెప్పాడు. ఇండియా తో పాటు నార్త్ కొరియా తదితర దేశాల పౌరులను ఉద్యోగాల పేరిట ఆర్మీలో జాయిన్ చేసుకుంటున్నారని చెప్పాడు హుస్సేన్.