- తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్, లుహాన్స్క్ స్వతంత్రతనుగుర్తిస్తున్నట్లు పుతిన్ ప్రకటన
- ఇది మాపై దాడే.. మేం ఎవ్వరికీ బాకీ లేం.. దేన్నీ ఇవ్వబోమన్న ఉక్రెయిన్
- రష్యా వెనక్కి తగ్గకపోతే కఠిన ఆంక్షలు: అమెరికా
- ఆంక్షలు అమలైతే ఈయూ దేశాలకు గ్యాస్ కొరత!
ఆంక్షలు తప్పవని అగ్రదేశం అమెరికా హెచ్చరిస్తున్నా రష్యా అదరడం లేదు! యూరప్ అంతా ఒక్కటై బెదిరిస్తున్నా బెదరడం లేదు. మిత్ర దేశాలు బతిమిలాడుతున్నా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ విషయంలో తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ అగ్రెసివ్‌గా ఉంటోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్, లుహాన్స్క్‌లను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించి అగ్గిరాజేసింది. అక్కడికి సైన్యాన్ని కూడా పంపింది. ‘ఇంత దాకా వచ్చినంక.. ఇప్పుడు చర్చలేంటి’ అంటూ అమెరికా, యూరప్ దేశాలను ఎదురు ప్రశ్నిస్తోంది. తాము తీసుకుంటున్న చర్యలు ‘శాంతి పరిరక్షణ’ కోసమేనని చెప్పుకుంటోంది. అటు పక్కలో బల్లెంలా రెబల్స్.. ఇటు రష్యా దూకుడుతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయినా తాము ఎవ్వరికీ భయపడబోమని, ఇంచ్ జాగా కూడా వదులుకోబోమని స్పష్టం చేసింది. రెండు దేశాలు యుద్ధం ముంగిట నిలిస్తే.. ఏ క్షణంలో ఏమవుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
మాస్కో/కీవ్: ‘యుద్ధం తప్పదు’ అనే రీతిలో రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమకు వ్యతిరేకంగా ఆంక్షలు ప్రకటించిన వెస్ట్రన్ దేశాలకు సవాళ్లు విసురుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్స్క్, లుహాన్స్క్ స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్.. అక్కడ శాంతి పరిరక్షణ కోసం బలగాలను పంపుతామంటూ బాంబు పేల్చారు. అన్నట్లుగానే మంగళవారం డోనెట్స్క్, లుహాన్స్క్ లకు రష్యన్ బలగాలను పంపించారు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు మూడు వైపులా లక్షన్నర మంది సోల్జర్లను మోహరించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగానికి మరింత దగ్గరగా తన సైన్యాన్ని పంపించారు. తమ మిత్రులైన రెబల్స్‌కు సాయం చేస్తామనే నెపంతో.. అక్కడ తన మిలటరీని మోహరించారు. సంబంధిత డిక్రీలపై పుతిన్ సంతకం చేసిన కొన్ని గంటల్లోనే.. రెబల్స్ ఆధ్వర్యంలోని ప్రాంతాల్లో సాయుధ వాహనాల కాన్వాయ్‌లు తిరగడం కనిపించింది. తిరుగుబాటుదారుల ప్రాంతాల్లో దళాలను మోహరించినట్లు రష్యా అధికారులు చెప్పలేదు. కానీ డోనెట్స్క్‌లోకి రష్యన్ దళాలు ఇప్పటికే చేరుకున్నాయని సపరేటిస్ట్ నేతలు చెబుతున్నారు.
ఉక్రెయిన్ రష్యాలో భాగం: పుతిన్
ఉక్రెయిన్ తన దేశ చరిత్రలో అంతర్భాగమని, తూర్పు ఉక్రెయిన్‌ను ‘పురాతన రష్యాలోని భాగం’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రస్తుత సంక్షోభానికి నాటోనే కారణమని అన్నారు. అమెరికా ఆధ్వర్యంలోని కూటమి రష్యాకు అస్తిత్వ ముప్పుగా మారిందని మండిపడ్డారు. సోమవారం అర్ధరాత్రి ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్‌కు రష్యాతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యాను నియంత్రించడానికి పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇస్తే.. రష్యా సెక్యూరిటీకి ముప్పు అని చెప్పారు. ఉక్రెయిన్‌తోపాటు గత సోవియట్ యూనియన్‌లోని దేశాలను నాటోలో చేర్చుకోవడాన్ని ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ‘‘చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్సెక్ పీపుల్స్ రిపబ్లిక్.. స్వాతంత్ర్యం, సార్వభౌమత్వాన్ని వెంటనే గుర్తిస్తున్నా’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన డిక్రీపై సంతకం చేసిన పుతిన్.. పార్లమెంటు ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేయాలని కోరారు. రష్యా వెలుపల మిలటరీని ఉపయోగించేందుకు ఆ దేశ ఎగువ సభ మంగళవారం ఏకగ్రీవంగా అనుమతించింది. డోనెట్స్క్, లుహాన్స్క్ ల స్వాతంత్ర్యాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటన రాగానే.. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రజలు సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, రష్యా జెండాలు ఎగరేసి, రష్యా జాతీయ గీతం పాడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు.
ఉక్రెయిన్‌కు ప్రాణసంకటం
తూర్పు ఉక్రెయిన్‌లో డోనెట్స్క్, లుహాన్సెక్‌లను 2014లో రష్యా అనుకూల తిరుగుబాటుదారులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ రెండు ప్రాంతాలను రిపబ్లిక్‌లుగా ప్రకటించుకున్నారు. రష్యా వీటికి వెనుక ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది. తాజాగా వాటి స్వాతంత్ర్యాన్ని రష్యా గుర్తించింది. అంటే.. ఈ రెండూ ఉక్రెయిన్‌లో భాగం కాదని పరోక్షంగా చెప్పడమే. ఇలా చేయడం ద్వారా.. మిలటరీ ఫోర్సెస్‌ను పంపేందుకు రష్యాకు మార్గం సుగమం అవుతుంది. ఉక్రెయిన్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు డోనెట్స్క్, లుహాన్సెక్ రెబల్స్.. రష్యా మిలటరీ సాయం అడగొచ్చు. ఇది ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధానికి దారి తీసే అవకాశాలను మరింతగా పెంచింది.
