
న్యూఢిల్లీ, వెలుగు : రష్యా– ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో తమ పిల్లల్ని సురక్షితంగా దేశానికి తీసుకొచ్చిన కేంద్రమే ఇప్పుడు వారి భవిష్యత్‌ను కాపాడాలని ఉక్రెయిన్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఉక్రెయిన్‌లో ఆగిపోయిన మెడిసిన్ చదువును మన దేశంలో కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక నిరాహార దీక్షలో ఆదివారం తెలంగాణ, ఏపీ నుంచి దాదాపు 20 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ.. తమకు అవకాశం కల్పించేలా పార్లమెంట్లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) యాక్ట్ –2019లో సవరణలు చేయాలన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం కొనసాగుతున్నందున అక్కడికి వెళ్లలేమని, ఆన్లైన్ క్లాసుల ద్వారా మెడికల్ విద్య సాధ్యం కాదని తెలిపారు. శ్రీలంకకు సాయం చేస్తున్న కేంద్రం.. దేశానికి చెందిన విద్యార్థులకు న్యాయం చెయ్యలేదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని కోరారు. భారత్ లో ఫీజులు అధికంగా ఉన్నందునే ఉక్రెయిన్ వరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అప్పులు చేసి, లోన్లు తీసుకుని మెడికల్ విద్య కోసం పిల్లలను ఉక్రెయిన్ పంపామని పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు.