ప్రాణాలతో ఉండాలంటే.. మీ పిల్లల్ని యుద్ధానికి పంపకండి

ప్రాణాలతో ఉండాలంటే.. మీ పిల్లల్ని యుద్ధానికి పంపకండి

కీవ్: రష్యా సైనికచర్యతో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారింది. రష్యన్ బలగాలు వేస్తున్న బాంబులు, పేలుస్తున్న తుపాకుల శబ్దాలతో ప్రజలు ప్రాణభయంతో పొరుగు దేశాలకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తాజాగా రష్యా ప్రజలను ఉద్దేశించి కీలక అభ్యర్థన చేశారు. రష్యన్ సైనికుల తల్లులు తమ కొడుకులను యుద్ధానికి పంపొద్దని ఆయన కోరారు. ‘రష్యన్ తల్లులకు మరోసారి విన్నవిస్తున్నా.. మీ పిల్లల్ని యుద్ధానికి పంపకండి. మీ కుమారులు ఎక్కడ ఉన్నారో చెక్ చేస్కోండి. ఒకవేళ మీ కొడుకులను ఉక్రెయిన్ లోని యుద్ధ రంగానికి పంపిస్తున్నారనే అనుమానం వస్తే వెంటనే అడ్డుకోండి. వారు ప్రాణాలతో ఉండాలంటే అడ్డుకోండి’ అని పొరుగు దేశం మహిళల్ని జెలెన్స్కీ అభ్యర్థించారు. ఇలాంటి భయానక యుద్ధాన్ని ఉక్రెయిన్ ఎప్పుడూ కోరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ ఇలాంటి పరిస్థితులను కోరుకోబోమన్నారు. అయితే ఎవరైనా తమపై దాడులకు దిగితే.. దేశాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని పేర్కొన్నారు. 

కాగా, ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో దాదాపు 12 వేల మంది రష్యన్ సైనికుల్ని తాము హతమార్చామని.. అనేక మందిని నిర్బంధంలోకి తీసుకున్నామని జెలెన్స్కీప్రకటించారు. అయితే రష్యా మాత్రం తమ సైనికుల మృతిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తమవైపు 498 మంది జవాన్లు మృతి చెందారని యుద్ధం ప్రారంభమైన తొలి వారంలో చెప్పింది. ఆ తర్వాత నుంచి పుతిన్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కొందరు సైనికులు ఉక్రెయిన్ లో బందీలుగా ఉన్నారని మాత్రం అధికారికంగా వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం:

రంగంలోకి దిగిన ‘వలీ’.. రష్యన్ బలగాల్లో దడ

ఉద్యోగులకు షాకిచ్చిన ఈపీఎఫ్ఓ

పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా