ఓ ఉక్రెయిన్ సైనికుడి దీనగాథ

ఓ ఉక్రెయిన్ సైనికుడి దీనగాథ

ఒక ఉక్రెయిన్ సైనికుడి దీనగాథను అద్దంపట్టే దృశ్యాలివి.

యుద్ధం చేస్తుండగా దొరికిపోయిన ఉక్రెయిన్ సైనికులతో రష్యా అరాచకంగా ప్రవర్తించిన తీరుకు ప్రత్యక్ష నిదర్శనాలివి. 

ఆ ఉక్రెయిన్ సైనికుడి పేరు మైఖైలో డియనోవ్. సెప్టెంబరు 21న రష్యా ఆర్మీ విడుదల చేసిన 205 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల్లో ఆయన ఒకరు. కండలు తిరిగిన దేహం, పూర్తి ఫిట్ నెస్ తో యుద్ధ రంగంలోకి దూకిన డియనోవ్ ఇలా బక్క చిక్కాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది. కొన్ని నెలల తరబడి చికిత్స అందిస్తే కానీ కోలుకోడని వైద్యులు అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల శిబిరంలో తగిన చికిత్స అందించే ఏర్పాట్లను రష్యా చేయకపోవడంతో.. మోచేయిలోని ఒక ఎముకను కూడా కోల్పోయాడు. చేయిలోకి దిగిన బుల్లెట్ ను తీసేందుకు తుప్పు పట్టిన శస్త్రచికిత్స పరికరాలను వాడటంతో అతడికి ఇన్ఫెక్షన్ కూడా సోకింది.

ఉక్రెయిన్ రక్షణ శాఖ ట్వీట్

మైఖైలో డియనోవ్ పాత, కొత్త ఫొటోలతో ఉక్రెయిన్ రక్షణ శాఖ సెప్టెంబరు 23న ట్విట్టర్ వేదికగా ఇటీవల చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘ జెనీవా ఒప్పందానికి విరుద్ధంగా యుద్ధ ఖైదీల హక్కుల ఉల్లంఘనకు రష్యా పాల్పడిన తీరుకు ఈ ఫొటోలు నిదర్శనం. ఈవిధంగా నాజీల సంప్రదాయాన్ని రష్యా కొనసాగిస్తోంది’’ అని ఆ పోస్ట్ లో ఉక్రెయిన్ రక్షణ శాఖ కామెంట్ చేసింది. ప్రస్తుతం సైనికుడు డియనోవ్ ఆరోగ్య పరిస్థితి అంత బాగా లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు విరాళాలను సేకరించే పనిలో అతడి సోదరి లవ్రుష్కో నిమగ్నమైంది. 

ఈ ఏడాది తొలినాళ్లలో..

ఈ ఏడాది తొలినాళ్లలో ఉక్రెయిన్ లోని మారియోపోల్ నగరం వద్దనున్న ఆజోవ్ స్టాల్ స్టీల్ వర్క్స్ అనే కంపెనీపై రష్యా సైన్యం దాడికి పాల్పడింది. దానితో వీరోచితంగా పోరాడిన ఉక్రెయిన్ ఆర్మీ సభ్యుల్లో మైఖైలో డియనోవ్ ఒకరు. చివరకు రష్యా సైనిక బలంతో ఆ స్టీల్ ఫ్యాక్టరీని ఆధీనంలోకి తీసుకొని.. డియనోవ్ సహా ఎంతోమంది ఉక్రెయిన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. వారిని తన ఆధీనంలోని ప్రాంతాల్లో బంధించి ఉంచింది. ఈక్రమంలో తగిన ఆహారం, సరైన వైద్యం అందక ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు ఇలా చిక్కిపోయారు.