కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా అరాచక దాడులు మళ్లీ మొదలయ్యాయని, యుద్ధంలో ఇది రెండో ఫేజ్ అని జెలెన్స్కీ మండిపడ్డారు. ఖార్కివ్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించడంతో ఐదుగురు పౌరులు చనిపోగా, మరో 17 మంది గాయపడ్డారని వివరించారు. కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో డాన్బాస్ రీజియన్‌పై రష్యా కన్నేసింది. ఇండస్ట్రియల్ సెక్టార్‌కు కీలకమైన ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ తూర్పువైపున ఉన్న నగరాలు, పట్టణాలపై దాడుల తీవ్రతను పెంచింది. దీంతో యుద్ధం మరో దశకు చేరుకుందని రెండు దేశాల అధికార వర్గాలు చెబుతున్నాయి. మరియుపోల్‌లోని ఉక్రెయిన్ సైనికులు వెంటనే ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ మళ్లీ హెచ్చరించింది.
