ఎంబీబీఎస్ ఫీజులు తక్కువ ఉండడం వల్లే ఉక్రెయిన్ కు..

ఎంబీబీఎస్ ఫీజులు తక్కువ ఉండడం వల్లే ఉక్రెయిన్ కు..
  • రాష్ట్రం నుంచి ఏటా వెయ్యి మంది స్టూడెంట్ల పయనం
  • మన దగ్గర కోర్సు పూర్తవడానికి రూ. 57 లక్షలు.. 
  • ఉక్రెయిన్​లో రూ.20 లక్షలు

హైదరాబాద్, వెలుగు: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ సీట్ల ఫీజులపై చర్చకు తెరదీసింది. ఉక్రెయిన్‌‌లో సుమారు 20 వేల మంది ఇండియన్​ స్టూడెంట్లు ఉంటే.. ఇందులో ఎక్కువ మంది మెడికల్ స్టూడెంట్లే ఉన్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే  రెండు మూడు వేల మంది వరకు ఉంటారు. దీంతో అసలు ఇంత మంది మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వరకూ ఎందుకు పోతున్నారంటే.. మన దగ్గర మెడిసిన్ కోర్సులకు ఉన్న ఫీజుల భారాన్ని తట్టుకోలేక, అక్కడ తక్కువ ఫీజులు ఉండటమే కారణం. ఏపీ, తెలంగాణ నుంచి ఏటా సుమారు పది వేల మంది మెడిసిన్ చదివేందుకు వివిధ దేశాలకు వెళ్తున్నారు. ఇందులో సుమారు వెయ్యి నుంచి రెండు వేల మంది వరకూ ఉక్రెయిన్‌‌కే పోతున్నారు. 
అక్కడ 18 మెడికల్​ వర్సిటీలు
చిన్న దేశమే అయినప్పటికీ ఉక్రెయిన్​లో 18 మెడికల్ యూనివర్సిటీలు ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పోలిస్తే, ఉక్రెయిన్​ యూనివర్సిటీల్లో ఫీజులు చాలా తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌ మేనేజ్‌‌మెంట్ కోటా సీటు ఫీజు, కాలేజీని బట్టి సంవత్సరానికి రూ.11.5 లక్షల నుంచి 14.5 లక్షల వరకు ఉంది. ఏపీలోనూ దాదాపు ఇదే రేంజ్‌‌లో ఫీజులు ఉన్నాయి. ఉక్రెయిన్‌‌లో యూనివర్సిటీని బట్టి సంవత్సరానికి రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు మాత్రమే ఉంది. అంటే, ఎంబీబీఎస్ కోర్సు (దాదాపు ఐదేండ్లు) మొత్తం పూర్తి చేయడానికి మన దగ్గర కనీసం రూ.57 లక్షల నుంచి 72 లక్షలు కట్టాల్సి ఉండగా.. ఉక్రెయిన్‌‌లో రూ.15 లక్షల నుంచి 20 లక్షలు కడితే సరిపోతుంది. ఈ భారీ తేడా వల్లే ఎక్కువ మంది స్టూడెంట్స్‌‌ ఉక్రెయిన్‌‌ వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. స్టూడెంట్లను పంపించేందుకు అక్కడి యూనివర్సిటీలు మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కన్సల్టెన్సీలను కూడా నియమించుకున్నాయి. ఒక్క ఉక్రెయిన్ మాత్రమే కాదు.. చైనా, రష్యా, ఫిలిప్పీన్స్‌‌, బెలారస్, అజార్‌‌‌‌బైజాన్, జార్జియా, కజకిస్తాన్ వంటి అనేక దేశాల్లో మెడికల్ సీట్ల ఫీజులు మన కంటే చాలా తక్కువగా ఉన్నాయి.
మన దగ్గర స్టూడెంట్స్‌‌ ఎక్కువ.. సీట్లు తక్కువ
మన దేశంలో, రాష్ట్రంలో మెడిసిన్ చదవాలనుకునే స్టూడెంట్ల సంఖ్యకు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యకు భారీ తేడా ఉంది. ఇది కూడా ఇక్కడి స్టూడెంట్లు విదేశాలకు వెళ్లడానికి కారణమవుతున్నది. దేశంలో ఏటా 16 లక్షల మంది స్టూడెంట్స్‌‌.. డాక్టర్‌‌‌‌ అవ్వాలన్న కోరికతో నీట్‌‌ ఎగ్జామ్ రాస్తున్నారు. కానీ, మన దేశంలోని అన్ని కాలేజీలు, యూనివర్సిటీల్లో కలిపి 84 వేల ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. మన రాష్ట్రం నుంచి ఏటా 50 వేల మంది నీట్ రాస్తుండగా.. 5,200 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నీట్ క్వాలిఫై అయినవాళ్లలో సగం మందికి కూడా సీట్లు రావడం లేదు. దీంతో ఇక్కడ సీట్లు రాని స్టూడెంట్లు, ఇక్కడ ఫీజుల భారాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు.. విదేశాల్లోని మెడికల్ కాలేజీల వైపు చూస్తున్నారు. ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన కన్సల్టెన్సీలు ఇక్కడ ఉండడం, భారీ ఎత్తున ప్రచారం చేయడం కూడా ఇందుకు సహకరిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దేశంలో, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. దేవ్యాప్తంగా సుమారు 150 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర సర్కార్ నిధులు వెచ్చించింది. మన రాష్ట్ర సర్కార్ జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. ప్పటికే 8 కాలేజీల నిర్మాణం చేపట్టింది.
ఫీజులో భారీ తేడా..
మన దగ్గర ఎంబీబీఎస్ ఫీజు చాలా ఎక్కువగా ఉండటం వల్లే, ఉక్రెయిన్‌‌లో మెడిసిన్ చేయాలని నిర్ణయించుకున్నం. మన దగ్గర ఒక్కో కాలేజీ ఫీజు, డొనేషన్లు కలిపి ఏడాదికి రూ. 15 లక్షల కంటే ఎక్కువ అవుతుంది. ఉక్రెయిన్​లో మొత్తం కోర్సు ఫీజు రూ. 18 లక్షలు మాత్రమే. దాదాపు ఉక్రెయిన్​లోని అన్ని కాలేజీల్లోనూ ఫీజు రూ. 20 లక్షల లోపే ఉంది. అందుకే ఉక్రెయిన్‌‌కు వచ్చి చాలా మంది ఎంబీబీఎస్​ చేస్తున్నారు. ఒక్క తెలంగాణ నుంచే ఏటా వెయ్యి మంది స్టూడెంట్స్‌‌ వస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా బాగుంది. - సాయి నాయక్‌‌, వరంగల్(ఉక్రెయిన్​లో మెడిసిన్​ చదువుతున్న స్టూడెంట్​)
ఇండియన్ స్టూడెంట్స్‌‌కు స్పెషల్ క్లాసులు
ఉక్రెయిన్‌‌లో ఒక్కో వర్సిటీలో మెడికల్ సీట్ల సంఖ్య 300 నుంచి 600  వరకు ఉంది. గతంలో నార్త్ ఇండియా నుంచే ఉక్రెయిన్‌‌కు ఎక్కువ మంది స్టూడెంట్స్‌‌ వెళ్లేవాళ్లు. నాలుగేండ్ల నుంచి తెలంగాణ, ఏపీ నుంచి కూడా 1,500 నుంచి 2 వేల మంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్తుండడంతో కొన్ని యూనివర్సిటీల్లో ఇండియన్ స్టూడెంట్స్‌‌కు సెపరేట్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడితో పోలిస్తే ఫీజులు కూడా ఉక్రెయిన్​​లో చాలా తక్కువగా ఉన్నాయి. నీట్‌‌లో క్వాలిఫై అయితే చాలు.. మార్కులతో సంబంధం లేకుండా అక్కడ సీటు ఇస్తున్నారు. అందుకే స్టూడెంట్స్ ఉక్రెయిన్‌‌కు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. 
- టి. శ్రీనివాస్, ఎస్‌‌ఆర్‌‌‌‌ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, హైదరాబాద్‌‌