
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దిల్ రాజు ఇలా ముచ్చటించారు.
- ఈ చిత్రం మొదటి 20 నిమిషాలు మినహా మిగతా కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఇందులో ఐదారు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిలో రెండు ఎపిసోడ్స్ కొంత వైలెంట్‌గా ఉన్నాయి. ఇది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే తీసిన యాక్షన్ ఎంటర్‌టైనర్ కనుక ఆ రెండు ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ‘ఎ’ సర్టిఫికెట్‌కు ఒప్పుకున్నాం.
- కథగా ఇది సింపుల్ స్టోరీ. అక్క, తమ్ముడి మధ్య ఓ సమస్య, దాన్ని పరిష్కారం. కానీ కొత్త తరహా స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్‌తో శ్రీరామ్ ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఎనభై శాతం అడవి నేపథ్యంలో చిత్రీకరించాం. 150 రోజులు షూటింగ్ జరిగింది. విజువల్స్‌తో పాటు సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ ప్రేక్షకులు థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.
- రివ్యూస్ కారణంగా హీరో, డైరెక్టర్స్ కంటే ఎక్కువ నష్టపోయేది నిర్మాతలే. అందుకే ఎవరైనా రివ్యూస్ రాసేటప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. ఇదే విషయాన్ని నేను గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు. ఇటీవల నితిన్‌తో చేసిన ఇంటర్వ్యూలోనూ తన గుడ్, బ్యాడ్ ఏమిటో చెప్పమంటే.. అల్లు అర్జున్ కంటే ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్.. తన రేంజ్‌కు వెళ్లలేకపోయావ్ అన్నాను. నితిన్‌తో ఉన్న చనువు, రిలేషన్‌తో తన వెల్ విషర్‌గా అలా చెప్పాను. దాన్ని నెగిటివ్‌గా చూడొద్దు.
- ప్రస్తుతం మా సంస్థలో రౌడీ జనార్థన్, ఎల్లమ్మ, దేత్తడి చిత్రాలు జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తాం. వచ్చే ఏడాది తీయబోయే ఐదారు సినిమాలు స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటిలో అనిల్ రావిపూడి సినిమా, ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్‌తో ఒక సినిమా ఉంటాయి. ఇవికాక ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘రావణం’ అనే సినిమా ఉంటుంది. హ్యూజ్ బడ్జెట్‌తో తీయాల్సిన సినిమా కనుక కొంత టైమ్ పడుతుంది. ఇవి కాకుండా దిల్ రాజు డ్రీమ్స్‌లో మూడు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి.
దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ చేంజర్’ సినిమా రిజల్ట్ విషయంలో చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. చరణ్ అభిమానుల నుంచి విమర్శలు రావడంతో బుధవారం శిరీష్ రెడ్డి స్పందించారు. తాను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ ఒకరని, తమ మధ్య రిలేషన్‌షిప్, క్లోజ్‌నెస్‌లో అలా మాట దొర్లాను తప్ప అవమానపరచడానికి కాదని చెబుతూ, చరణ్‌తో పాటు ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్పారు.