సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో 40కి చేరిన మృతుల సంఖ్య

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో 40కి చేరిన మృతుల సంఖ్య

18 మృతదేహాల గుర్తింపు.. బంధువులకు అప్పగింత  
సిగాచి ఫ్యాక్టరీ వద్ద కుటుంబ సభ్యుల రోదనలు  

సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. బుధవారం మరో నాలుగు మృతదేహాలు దొరికాయి. దీంతో ఇప్పటివరకు చనిపోయినోళ్ల సంఖ్య 40కి చేరింది. డీఎన్ఏ టెస్టుల ద్వారా ఇప్పటి వరకు 18 మృతదేహాలను గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. అధికారుల లెక్క ప్రకారం.. ప్రమాదం జరిగిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 143 మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. వీరిలో 40 మంది చనిపోగా, మరో 54 మంది వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ పొందుతున్నారు. 

ఇంకా 49 మంది ఆచూకీ లభించలేదు. వాళ్లు ఏమైపోయారోనని తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్ల కోసం ఫ్యాక్టరీ వద్దనే వేచి చూస్తూ రోదిస్తున్నారు. కాగా, ఫ్యాక్టరీ వద్ద మూడ్రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది. శిథిలాల కింద దొరుకుతున్న మృతదేహాలన్నీ మాంసం ముద్దలు అయిపోయాయి. దీంతో చనిపోయినోళ్లను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. 

కండ్లు మూసి తెరిచేలోగా.. 

సిగాచి పరిశ్రమలో పేలుడు కారణంగా సంభవించిన విధ్వంసం భారీ స్థాయిలో ఉంది. పేలుడు జరిగిన సమయంలో చుట్టుపక్కల పరిశ్రమల్లోని సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయిన దృశ్యాలు తాజాగా బయటకొచ్చాయి. భారీ ఆటమ్ బాంబు ఏమైనా పేలిందా? భూకంపం వచ్చిందా? అన్నట్టుగా చుట్టుపక్కల భూమంతా కంపించిపోయింది. కొందరైతే భూకంపం వచ్చిందనుకొని ఫ్యాక్టరీలు, ఇండ్ల నుంచి బయటకు పరుగుపెట్టిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.

 స్ప్రేయర్ డ్రయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధిక టెంపరేచర్లను నియంత్రించే సేఫ్టీవాల్వ్, బ్లోయర్​హ్యాండ్లర్ పనిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. డ్రయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడుతుందని, ఈ టెంపరేచర్లను కంట్రోల్ చేయాల్సిన బ్లోయర్​హ్యాండ్లర్ ఫెయిల్ కావడం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని చెబుతున్నారు. ఈ స్థాయి టెంపరేచర్లకు చుట్టుపక్కల 50 మీటర్ల పరిధిలో ఎవరూ బతికే అవకాశం లేదంటున్నారు. డ్రయర్​నుంచి వచ్చిన మంటల ధాటికి కండ్లు మూసి తెరిచేలోగా చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని చెబుతున్నారు.  

కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బాధితుల ఆగ్రహం.. 

పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు ఏరియా ఆస్పత్రి వద్ద సిగాచి కంపెనీ ప్రతినిధులను బాధిత కార్మిక కుటుంబాలు నిలదీశాయి. ఆస్పత్రి వద్ద తమ బంధువుల కోసం ఎదురుచూస్తున్న బాధితులను పరామర్శించేందుకు సిగాచి పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ చిదంబర్ నాథన్,​ సిబ్బంది వచ్చారు. ఈ క్రమంలో తమ వారి ఆచూకీ చెప్పాలని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య విషయంలో యాజమాన్యం పొంతన లేని లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. ‘‘ఘటన జరిగి మూడ్రోజులు అవుతున్నా మా వాళ్ల ఆచూకీ దొరకడం లేదు.. అసలు వాళ్లు బతికున్నారా? లేదా? ఉంటే ఎక్కడ, ఎలా ఉన్నారో చెప్పండి’’ అని నిలదీశారు.