
మోతే (మునగాల), వెలుగు: ఆస్తి విషయంలో గొడవ పడిన కొడుకు తన కన్న తండ్రిని దారి కాచి గొడ్డలితో నరికి చంపేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతే మండలం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన వెంకన్నకు, అతడి పెద్ద కొడుకు గంగయ్య మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. వీటిని మనసులో పెట్టుకున్న గంగయ్య తండ్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
వెంకన్న బుధవారం ఓ పని మీద తన మోపెడ్‌పై మామిళ్లగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా, విభలాపురం శివారుకు రాగానే మోపెడ్‌ను వెంబడించి తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలపై వేటు వేశాడు. తీవ్రగాయాలపాలై రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్న వెంకన్నను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై యాదవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. హత్య చేసిన గంగయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.