
కటక్: అల్టిమేట్ ఖో ఖో లీగ్ రెండో సీజన్‌లో అందరికంటే ముందే సెమీఫైనల్ చేరుకున్న తెలుగు యోధాస్ వరుసగా రెండోసారి ఫైనల్ బెర్తుపై గురి పెట్టింది. గురువారం జరిగే సెమీఫైనల్లో చెన్నై క్విక్ గన్స్‌తో యోధాస్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్‌లో ఆరంభం నుంచి అదరగొట్టిన యోధాస్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని యంగ్‌స్టర్స్‌తో కూడిన చెన్నై పని పట్టాలని ఆశిస్తోంది. లీగ్ దశలో చెన్నైతో ఆడిన పోరులో గెలవడం యోధాస్ ఆత్మవిశ్వాసం పెంచుతోంది. ఈ సీజన్‌లో టాప్ వాజిర్‌గానే కాకుండా అత్యధిక పోల్ డైవ్స్ చేసిన కెప్టెన్ ప్రతీక్ నాకౌట్‌లో కీలకం కానున్నాడు. కాగా, మరో సెమీస్‌లో ఒడిశా జాగర్‌నాట్స్‌తో గుజరాత్ జెయింట్స్ పోటీ పడనుంది.