జవాన్ల కోసం దేశాన్ని చుట్టేస్తున్న జాదవ్

జవాన్ల కోసం దేశాన్ని చుట్టేస్తున్న జాదవ్
  • మూడు సంవత్సరాల రెండు నెలల పద్దెనిమిది రోజులు
  • ఇరవై ఎనిమిది రాష్ట్రాలు
  • ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు.
  • ఇంచుమించుగా లక్షా పద్దెనిమిది వేల కిలోమీటర్లు 

40 ఏండ్ల ఉమేశ్​ గోపినాథ్​ జాదవ్​ చేసిన జర్నీ ఇది.. ఇదేదో సరదా కోసం చేస్తున్న జర్నీ కాదు. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికులు పుట్టిన నేలని ముద్దాడాలన్న ఆశ. వాళ్లు తిరిగిన నేలనుంచి గుప్పెడు మట్టి సేకరించాలన్న సంకల్పం. అందుకోసం రేయి, పగలు తేడా లేకుండా ఎండనక, వాననక దేశాన్ని చుట్టేస్తున్నాడు ఉమేశ్ జాదవ్​. ఇలా చేయడం వెనక ఉన్న కారణం అడిగితే.. తన కథంతా ఇలా చెప్పుకొచ్చాడు ఉమేశ్​.

‘‘అది ఫిబ్రవరి 14, 2019. పుల్వామా టెర్రరిస్టుల దాడి జరిగిన రోజు. అప్పటికే ఫార్మసీలో  మాస్టర్స్​ పూర్తి చేసి, కాలేజీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నా. మ్యుజీషియన్​గానూ మంచి పేరు తెచ్చుకున్నా. బెంగళూరులో సొంతంగా మ్యూజిక్​ స్కూల్​ నడుపుతున్నా. ఆర్మీ ఫోర్స్​, పోలీస్​ డిపార్ట్​మెంట్స్​కి మ్యూజిక్​ ఈవెంట్స్​ కూడా చేస్తుండేవాడ్ని. అలా ఆ రోజు ఒక పేట్రియాట్రిక్​ ఈవెంట్​ కోసం జైపూర్​ వెళ్లా. కాన్సర్ట్​ పూర్తయ్యాక తిరిగి బెంగళూరు వెళ్లడానికి ఎయిర్​ పోర్ట్​కి వచ్చా. కానీ, పుల్వామా అటాక్​ వల్ల నేను ఎక్కాల్సిన విమానం రెండు గంటలు ఆలస్యంగా వస్తుందని అనౌన్స్​మెంట్. వార్తలు ​ చూస్తే ఆ ఉగ్రదాడిలో  ఐదు, పది, ఇరవై అంటూ చివరికి నలభైమంది సైనికులు వీర మరణం చెందారన్న న్యూస్​. సోషల్​ మీడియాలో ఎక్కడ చూసినా.. ‘ రెస్ట్​ ఇన్​ పీస్​’, ‘ వియ్​ స్టాండ్​ విత్​ ఇండియన్​ ఆర్మీ’ అంటూ పోస్ట్​లు. అప్పుడనిపించింది.. ఆ దాడిలో  మా నాన్న, తమ్ముడు లేదా ఫ్రెండ్​ చనిపోయి ఉంటే.. అలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్​ పెట్టి  ఊరుకుంటానా? లేదు కదా... అందుకే ఆ జవాన్ల ఇంటికెళ్లి వాళ్ల అమ్మానాన్నలకి ‘నేను మీతో ఉన్నా’ అని చెప్పాలనుకున్నా. వాళ్ల భార్య, పిల్లల్లో తోబుట్టువులా ధైర్యం నింపాలనుకున్నా . వాళ్లు పుట్టి, పెరిగిన, అంతిమ సంస్కారాలు జరిగిన నేల నుంచి మట్టిని తీసుకుని , దానితో ఇండియన్​ మ్యాప్​ తయారుచేయాలనుకున్నా. 

మ్యూజిక్​ స్కూల్​ క్లోజ్​ చేసి..

ఒక్క  పుల్వామా దాడే కాదు.. వరల్డ్ వార్​, 1971 ఇండో– పాక్​ వార్, కార్గిల్​, 26/11 ముంబై  దాడులు, గాల్వాన్​, సియాచిన్​, యురి అటాక్స్, ఆపరేషన్​ రక్షక్​, ఈ మధ్య జరిగిన కూనూర్​ హెలికాప్టర్​ క్రాష్​​లో చనిపోయిన సైనికుల మట్టిని  కూడా సేకరించాలనుకున్నా. అందుకోసం మా ఇంటికి ఆధారమైన మ్యూజిక్​ స్కూల్​ని క్లోజ్​ చేశా. ఇదే విషయం ఇంట్లో చెప్తే నా భార్య, ఇద్దరు పిల్లలు నవ్వుతూ సెండాఫ్​ ఇచ్చారు. అవసరమైన పర్మిషన్స్​ అన్నీ తీసుకొని...  ఏప్రిల్​ 9, 2019 లో బెంగళూరు సీఆర్​పీఎఫ్​ నుంచి  జర్నీ మొదలుపెట్టా.  ఏడాదిలో పదహారు రాష్ట్రాలు తిరిగి  పుల్వామా అటాక్​లో అమరులైన 40 మంది జవాన్ల ఇండ్ల నుంచి మట్టిని సేకరించా. వాళ్ల మొదటి వర్ధంతి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారకస్థూపం వద్ద ఆ మట్టిని సమర్పించా. ఆ తర్వాత వివిధ దాడుల్లో దేశం కోసం ప్రాణాలు విడిచిన వాళ్ల కోసం ప్రయాణం కొనసాగించా. అయితే ఈ జర్నీ వెనుక  సైనికుల త్యాగాల్ని అందరూ గుర్తించాలన్న తాపత్రయం ఉంది. వాళ్లని గుర్తు తెచ్చుకోవడం అనేది కేవలం ఆగష్టు 15, జనవరి 26 కి మాత్రమే పరిమితం కాకూడదన్న ఆలోచన ఉంది.  అందుకే నేను ప్రయాణిస్తున్న కారుపై ‘ జై భారత్​’, ‘భారత్​ కా వీర్​’ లాంటి  స్లోగన్స్​ రాశా. నా కారుకి ఒక ట్రక్​ని అటాచ్​ చేశా. అందులో ఒక బైక్​తో పాటు నా రోజువారీ సామాన్లు పెట్టుకుంటా.  ఫుడ్​ విషయానికొస్తే ఏ జవాన్​ ఇంటికెళ్లినా కడుపునిండా తినందే వదిలిపెట్టరు. 

డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నా..

రోజుకి రెండొందల నుంచి రెండొందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తా. రాత్రిళ్లు కారులోనే పడుకుంటా. జవాన్​ ఇంటికెళ్లి... వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్​ వీడియో బైట్స్​ తీసుకుంటా. జవాన్ల ఫొటోల్ని, వస్తువుల్ని కలెక్ట్​ చేస్తా. వాటన్నింటినీ జమచేసి ఫ్రెండ్​తో కలిసి ఒక డాక్యుమెంటరీ తీసే ఆలోచనలో ఉన్నా. అలా ఇప్పటివరకు లక్షా పద్దెనిమిదివేల కిలోమీటర్లు తిరిగి 150 మంది జవాన్ల ఇండ్ల నుంచి మట్టి సేకరించా. ప్రస్తుతం కోల్​కతాలో ఉన్న నేను జార్ఖండ్​, బీహార్​, లక్నో మీదుగా వచ్చేనెల పదిహేనులోపు ఢిల్లీ చేరుకుంటా.  ఇన్ని రోజులు నా భార్యా, పిల్లలకి దూరంగా ఉండటం కష్టంగానే అనిపించింది. కానీ, వీర జవాన్ల త్యాగం ముందు నా సమస్య చాలా చిన్నదిగా  అనిపించింది.  నా భార్య కూడా ఈ విషయంలో అండగా నిలిచింది. నా బాధ్యతని తన భుజానికెత్తుకుంది. ఉద్యోగం చేస్తూ  మా ఇద్దరు పిల్లల్ని  చదివిస్తోంది. ఈ జర్నీ కోసం నేను ఎవరి దగ్గర డొనేషన్స్​ తీసుకోలేదు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్​షిప్​ ఇస్తామన్నాయి. కానీ.. వద్దనుకున్నా. కార్పొరేట్​ ఫ్లెక్సీలకి బదులు జాతీయ జెండాలోని రంగులు మాత్రమే నా కారుపై ఉండాలన్నదే నేను వద్దనడం వెనకున్న ఉద్దేశం. 
::: ఆవుల యమున