భూమికి మహా విపత్తు..ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

భూమికి మహా విపత్తు..ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

యూఎన్ఓ: భూమి శరవేగంగా గ్లోబల్ వార్మింగ్ విపత్తు దిశగా వెళ్తోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ శతాబ్ది చివరికల్లా గ్లోబల్ టెంపరేచర్ కనీసం 2.7 డిగ్రీలు పెరగనుందని వాతావరణ మార్పులను అధ్యయనం చేస్తున్న యూఎన్ఓ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ నివేదిక వెల్లడించింది. గ్లోబల్ టెంపరేచర్ పెరుగుదల 1.5 డిగ్రీలను మించితే డేంజరేనన్నది సైంటిస్టుల మాట. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు పెను విపత్తుకు సూచికేనని యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘టెంపరేచర్ పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని ఆరేళ్ల క్రితం పారిస్ ఒప్పందంలో భాగంగా పెట్టుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితులు కన్పించడం లేదు. దాన్ని సాధించేందుకు అవసరమైన సాధనాలు లేకపోలేదు గానీ సమయమే శరవేగంగా చేయి దాటిపోతోంది” అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ శతాబ్ది మధ్యకల్లా కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలంటే గ్లోబల్ ఎమిషన్స్ స్థాయిని 2030 కల్లా కనీసం 45 శాతం తగ్గించాల్సి ఉంటుందని నివేదిక గుర్తు చేసింది. ‘‘కానీ ఇందుకు విరుద్ధంగా ఎమిషన్స్ రేటు 2030 కల్లా 16 శాతం పెరగనుంది. ఇదిలాగే కొనసాగితే శతాబ్ది చివరికల్లా గ్లోబల్ టెంపరేచర్ 2.7 డిగ్రీలు పెరుగుతుంది. ఇదిప్పటికే 1.2 డిగ్రీల స్థాయిని చేరింది. దీని పర్యవసానాలు అప్పుడే కళ్లముందు కన్పిస్తున్నాయి. ఈ సమ్మర్ లో పశ్చిమ అమెరికా, దక్షిణ యూరప్ లో భారీ కార్చిచ్చులు చెలరేగాయి. చైనా, జర్మనీ భయంకరమైన వరదలతో అల్లాడాయి. తక్షణం నివారణ చర్యలకు దిగకుంటే మున్ముందు పరిస్థితులు ఇంకా దిగజారొచ్చు” అని హెచ్చరించింది. కానీ పారిస్ ఒప్పందానికి మెజారిటీ దేశాలు కట్టుబడే పరిస్థితి కన్పించడం లేదని గుటెరస్ నిరాశ వెలిబుచ్చారు. కాబట్టి నవంబర్​లో జరగనున్న యూఎన్ వాతావరణ సదస్సు ఫెయిలయ్యే సూచనలే కన్పిస్తున్నాయన్నారు. గ్లోబల్ వార్మింగ్​ను అరికట్టే చర్యల కోసం వర్థమాన దేశాలకు 100 బిలియన్ డాలర్ల సాయం అందిస్తామన్న పదేళ్ల నాటి వాగ్దానాన్ని సంపన్న దేశాలు ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30% దాకా తగ్గించేలా అమెరికా, యూరోపియన్ యూనియన్ సంయుక్త ప్రణాళికను యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ శుక్రవారమే ప్రకటించారు.