ఈఎంఐ కట్టలేక పంచాయతీ ట్రాక్టర్‌‌వేలం

ఈఎంఐ కట్టలేక పంచాయతీ ట్రాక్టర్‌‌వేలం
  • ఈఎంఐ కట్టలేక పంచాయతీ ట్రాక్టర్‌‌వేలం
  • ఫేస్‌‌బుక్‌‌లో పోస్ట్‌‌ పెట్టిన చిక్కుడువానిపల్లె సర్పంచ్
  • చిక్కుడువానిపల్లె సర్పంచ్ ఫేస్‌‌బుక్ పోస్ట్ వైరల్ 

రాజన్న సిరిసిల్ల/తంగల్లపల్లి, వెలుగు: సర్కార్​ నుంచి ఫండ్స్ రాకపోవడంతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌‌‌‌ను వేలానికి పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువాని పల్లె గ్రామ సర్పంచ్​లాల రాధ వేలానికి సంబంధించి ఫేస్‌బుక్‌‌‌‌‌లో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘సర్కారు నుంచి ఫండ్స్ రాక మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లోన్ కట్టలేకపోతున్నాం. అందుకే ట్రాక్టర్‌‌‌ను వేలానికి పెట్టాం. ఆసక్తి ఉన్నవాళ్లు కొనుక్కోవచ్చు’’అంటూ పోస్ట్‌‌‌చేశారు. ప్రభుత్వం నుంచి నెలనెలా ఫండ్స్ రాకపోవడంతో ట్రాక్టర్ ఈఎంఐలు కట్టడం లేదని, దీంతో ఇల్లంతకుంట పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నెలనెలా నోటీసులు వస్తున్నాయని ఆమె చెప్పారు. 9 నెలల నుంచి తన సొంత పైసలతోనే ట్రాక్టర్‌‌‌‌‌‌లో డీజిల్ పోయిస్తున్నానన్నారు. ఈఎంఐలకు, పంచాయతీ సిబ్బంది జీతాలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తాను సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి దాదాపు రూ.10 లక్షలు అప్పులు చేసి సీసీ రోడ్లు, శ్మశానం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టానని కానీ, బిల్లులు రాకపోవడంతో నెలనెలా మిత్తిలు కడుతున్నానని వాపోయారు. ఈఎంఐలు కట్టాలని బ్యాంకు నుంచి ఒత్తిడి పెరగడంతో ట్రాక్టర్‌ను వేలానికి పెట్టినట్లు సర్పంచ్ రాధ తెలిపారు.

అప్పులపాలయ్యా... 

2019లో చిక్కుడువానిపల్లె సర్పంచ్‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. ఇందుకు సర్కారు రూ.10 లక్షలు, మంత్రి రూ.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మా గ్రామానికి ఇప్పటికీ జీపీ భవనం లేదు. మీటింగ్‌లన్ని చెట్ల కిందే పెట్టుకుంటున్నాం. జీపీ కార్యాలయాన్ని మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌కు దరఖాస్తు ఇచ్చినా.. స్పందనలేదు. అభివృద్ధి పనులు చేసి రూ.10 లక్షల అప్పుల పాలయ్యాం. గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేక సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఈ ఎంఐలు కట్టలేకే ట్రాక్టర్ వేలం వేస్తామని సోషల్ మీడియలో పోస్ట్ పెట్టాను. ఇప్పటికైనా మా సర్పంచుల బాధలు అర్థం చేసుకొని పంచాయతీలకు ఫండ్స్ విడుదల చేయాలి.
- రాధ, చిక్కుడువానిపల్లె సర్పంచ్