ఆ మూడు గ్రామాల సంగతేంది?..భానూర్ బల్దియాపై ప్రభుత్వం యూటర్న్..  బీడీఎల్ కారణంతో కేంద్రం నుంచి రాని పర్మిషన్

ఆ మూడు గ్రామాల సంగతేంది?..భానూర్ బల్దియాపై ప్రభుత్వం యూటర్న్..  బీడీఎల్ కారణంతో కేంద్రం నుంచి రాని పర్మిషన్

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు నియోజకవర్గంలోని భానూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలనే నిర్ణయంపై ప్రభుత్వం యూటర్న్  తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు రక్షణ శాఖకు చెందిన భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) ఈ పంచాయతీ పరిధిలో ఉండడమే కారణం. దీంతో ఈ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటే కేంద్రం పర్మిషన్ తప్పనిసరైంది. పటాన్ చెరు మండలంలోని భానూర్, క్యాసారం, నందిగామ పంచాయతీలను కలుపుతూ కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం 6 నెలల కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మున్సిపాలిటీగా కుదరని పక్షంలో ఆ మూడు గ్రామాలను ఇటీవల ఏర్పాటు చేసిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మెర్జ్ చేయాలని మరో ప్రతిపాదన పంపించారు. భానూర్ లో బీడీఎల్ ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి  కోరింది. కానీ అక్కడి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. 

ఆ 3 గ్రామాల పరిస్థితి ఏంటి? 

భానూర్‌ మున్సిపాలిటీ అప్ గ్రేడ్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వని పక్షంలో ఆ 3 గ్రామాల పరిస్థితి ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పటాన్ చెరు మండలంలో ఇదివరకు 19 గ్రామాలు ఉండగా ఇంద్రేశం, ఇస్నాపూర్ బల్దియాల్లో 16 గ్రామాలు విలీనమయ్యాయి. మిగిలిన  భానూర్, క్యాసారం, నందిగామ అలాగే ఉన్నాయి. ప్రస్తుతం స్థానిక ఎన్నికల హడావిడి క్రమంలో ఈ గ్రామాలు మున్సిపాలిటీ వైపు ఉంటాయా లేదా పంచాయతీల వైపు వెళ్తాయా అనేది తెలియడంలేదు. ఒకవేళ పటాన్ చెరు మండలంలోనే యధావిధిగా ఉంటే ఆ 3 గ్రామాలను కలిపి ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఉంటారు. ఐదు ఎంపీటీసీ స్థానాలతో మండల పరిషత్ ఏర్పడనుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం భానూర్ లో మూడు ఎంపీటీసీలు, క్యాసారం, నందిగామ పంచాయతీలలో ఒక్కో ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 

గెజిట్​లో భానూర్ గల్లంతు

మున్సిపాలిటీల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో భానూర్ పంచాయతీ పేరు గల్లంతైంది. కొన్ని నెలలుగా భానూర్, జిన్నారం, ఇంద్రేశం గ్రామాలు  మున్సిపాలిటీలుగా మారుతాయని ప్రచారం జోరందుకోగా జిన్నారం, ఇంద్రేశంలను మాత్రమే మున్సిపాలిటీలుగా మారుస్తున్నట్టు గెజిట్ లో ప్రభుత్వం పేర్కొంది. బీడీఎల్ కారణంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలియజేయకపోవడంతో గెజిట్ లో భానూర్ పేరును చేర్చలేదని అధికార వర్గాలు తెలిపాయి. మున్సిపాలిటీ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని భావించిన స్థానికులకు ప్రభుత్వ గెజిట్ షాక్‌ఇచ్చింది. ప్రస్తుతం భానూర్ భవిష్యత్​ విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.