బ్యాంకుల్లో మూలుగుతున్న 67 వేల కోట్ల జనం డబ్బు : ఎవరూ క్లెయిమ్ కూడా చేయటం లేదంట..!

బ్యాంకుల్లో మూలుగుతున్న 67 వేల కోట్ల జనం డబ్బు : ఎవరూ క్లెయిమ్ కూడా చేయటం లేదంట..!

దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల వద్ద ఎవ్వరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము ఏటకు ఏట పెరుగుతూనే ఉంది. సోమవారం పార్లమెంటులో ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్ 2025 చివరి నాటికి ఈ క్లెయిమ్ చేయని సొమ్ము రూ.67వేల 003 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థల వద్ద అత్యధికంగా రూ.58వేల 330కోట్ల 26లక్షలు ఉండగా.. ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థల ఖాతాల్లో రూ.8వేల 673కోట్ల 72లక్షల సొమ్ము మూలుగుతోందని తేలింది. 

ఇక బ్యాంకుల వారీగా డేటాను పరిశీలిస్తే.. మెుదటి స్థానంలో నిలిచిన స్టేట్ బ్యాంక్ వద్ద ఎవ్వరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ సొమ్ము రూ.19వేల 329కోట్ల 92లక్షలు ఉండిపోయింది. రెండో స్థానంలో నిలిచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాల్లో రూ.6వేల 910కోట్ల 67లక్షలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన కెనరా బ్యాంక్ వద్ద క్లెయిమ్ చేయని డబ్బు రూ.6వేల 278కోట్ల 14లక్షలకు చేరుకుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా చెప్పారు. 

ఇక ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంకులో అత్యధికంగా రూ.2వేల 063కోట్ల45 లక్షలు అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో రూ.వెయ్యి 609కోట్ల 56 లక్షలు, యాక్సిస్ బ్యాంకులో రూ.వెయ్యి 360కోట్ల16లక్షల  క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని వెల్లడైంది. అయితే వీటిని ఖాతాదారుల చట్టపరమైన వారసులకు అందించటం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రలైజ్డ్ వెబ్ పోర్టల్ UDGAMను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో అన్ని బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఒకే చోట అందించబడుతున్నాయి.