కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే డ్రామాలు ఆడుతున్నాయి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే డ్రామాలు ఆడుతున్నాయి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా:
వడ్ల కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే డ్రామాలు ఆడుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. భారీ ర్యాలీతో ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
ధర్నా సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణపై స్పష్టత ఇవ్వకపోవడంతో పీసీసీ పిలుపు మేరకే ఈ రైతు ఆందోళన చేపట్టామన్నారు. యుపిఏ ప్రభుత్వం హయాంలో  వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వం బాధ్యతగా భావించామని, 2004కు పూర్వం రూ.450 మద్దతు ధర ఉంటే మిలర్ల దోపిడీతో రూ.400లకే అమ్ముకున్నారని గుర్తు చేశారు. 
రూ.లక్ష మాఫీ.. సకాలంలో చెల్లిస్తే 5వేలు ప్రోత్సాహం అందించాం
ఆనాడు గ్రామ గ్రామాన ఐకేపి కొనుగోలు కేంద్రాలు ఆరంభించి రైతుకు ఆత్మస్థైర్యం నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్ కల్పించి రైతుకు అందించామన్నారు. అలాగే ఉచితంగా పంట రుణాలు, రూ.లక్ష రుణమాఫీ కల్పించి, సకాలంలో రుణం చెల్లించిన రైతులకు రూ. 5వేలు ప్రోత్సాహం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. 
ధనిక రాష్ట్రంలో భారాలను ప్రజలు గమనిస్తున్నారు
మిగులు, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో  రైతు బంధు నెపంతో ఉమ్మడి రాష్ట్రంలో అందించిన రాయితీలు నిలిపివేసి, రైతులపై మోపుతున్న భారాలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పండించిన పంటకు మద్దతు ధర బాధ్యత కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. 
రైతులు ఉరేసుకునే పరిస్థితి వచ్చాక రాష్ట్రం ఎందుకు..? పాలన ఎందుకు..?
వరి వేస్తె ఉరి అన్నావ్.. ఉరి పెట్టుకునే స్థాయికి రైతు వచ్చాక నీ రాష్ట్రం ఎందుకు? నీ పాలనా ఎందుకు? నీ ప్రభుత్వం ఎందుకు? అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రకటనతో రైతులు గందరగోళానికి గురయ్యారని మండిపడ్డారు. పార్లమెంట్ కొనసాగితూ ఉంటే.. ఢిల్లీలో ఉండి కూడా ప్రధాని, వ్యవసాయ మంత్రి, ఆఖరికి రాష్ట్రపతి ఆపాయింట్ మెంట్ పొందలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన విమర్శించారు.

ఢిల్లీలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వసతి గృహంలో ఉద్యమం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. నిజమైన ఉద్యమం జంతర్ మంతర్ వద్ద చెయ్యాల్సి ఉండే అని అన్నారు. ఏసీ కూలర్లు, టెంట్ లు వేసుకొని ధర్నాలు చేయడం అధికార దర్పమా? అని ప్రశ్నించారు. అవసరం వస్తే ఆత్మత్యాగం చేసైనా తెలంగాణ రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఇది అంతిమం కాదు - ఆరంభం మాత్రమేనని.. గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేవరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని..  ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అస్పష్టత విధానంతో రైతులు పంట నష్ట పోయారని.. పుష్కలంగా నీరుండి పంటలు సాగు చేయకుండా బీడుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అస్పష్టత విధానంతో సాగు చేయని భూములకు ఎకరాకు 10 వేలు అందించాలని, భవిష్యత్తులో ధాన్యం కొనుగోలు కేంద్రా ఆరంభం అయ్యే వరకు తరుగు, తప్ప తాలు లేకుండా ధాన్యం కొనుగోలు చేపించడం మా బాధ్యత అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

అప్పులు కట్టలేం.. చేతులెత్తేసిన ప్రభుత్వం

అసోంలో బిహు డ్యాన్స్పై వర్క్ షాప్

చైనాలోని 23 నగరాల్లో లాక్డౌన్..కఠిన ఆంక్షలు

మా వివరాలు ఇవ్వొద్దు..స్విస్ కోర్టులకు ఇండియన్ల రిక్వెస్ట్