సంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

సంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

చలికాలంలోనే అక్కడ ఎండకాలం పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాగునీటి సమస్య సర్వసాధారణం. కిలోమీటర్ల దూరం వెళ్లి…నీళ్లు తెచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు అక్కడి జనం. అడుగంటుతున్న భూగర్భ జలాలతో ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వర్షాభావంతో మరింత లోతుల్లోకి నీటిమట్టాలు పడిపోతుండడంతో వచ్చే వేసవిలో తమ పరిస్థితి ఏంటాని భయపడిపోతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. జిల్లాలోని చాలా గ్రామాల్లో అప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగునీటి కోసం పదుల కిలోమీటర్లు నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నారాయణఖేడ్ సరిహద్దు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోతుండడంతో ఎండాకాలంలో పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు అధికారులు. జనం నుంచి వచ్చే ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో ఏ ఊరికి వెళ్లినా… ఎండిన చెరువులు, కుంటలు కనిపిస్తున్నాయి. యాసంగిలో కేవలం బోర్లలో నీళ్లున్న ప్రాంతాల్లో మాత్రమే పంటలను సాగుచేశారు రైతులు. అయితే భూగర్భ జలాలు వేగంగా పడిపోతుండడంతో చివరి వరకు పంటలకు నీరివ్వగలమా…లేదా అని ఆందోళన చెందుతున్నారు. గతేడితో పోలిస్తే… జిల్లాలో 19.60 మీటర్ల లోతుకు పడిపోయాయి భూగర్భజలాలు. నిరుడు ఇదే సమయంలో నీటిమట్టం 12.01 మీటర్లుగా ఉంది. అంటే ఏకంగా 7.59 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాలో మొత్తం 26 మండలాలు ఉండగా ఆరు మండలాల్లో భూగర్భ జలమట్టాలు ఘణనీయంగా పడిపోయాయి. కొండాపూర్, సంగారెడ్డి, రామచంద్రాపురం, హత్నూర, కల్హేర్, గుమ్మడిదల మండలాల్లో ఏకంగా 25 మీటర్ల కంటే దిగువకు నీళ్లు చేరడం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. వరి, కూరగాయాలు సాగు ఎక్కువగా ఉండే ఈ మండలాల్లో…సాగునీటికి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.