ఆ ఏడుగురు ఎక్కడ?..సిగాచి కంపెనీలో అణువణువూ గాలిస్తున్న రెస్క్యూ టీమ్స్‌

ఆ ఏడుగురు ఎక్కడ?..సిగాచి కంపెనీలో అణువణువూ గాలిస్తున్న రెస్క్యూ టీమ్స్‌
  • కాలి బూడిదై ఉంటారని ఆఫీసర్ల అనుమానాలు
  • ఇప్పటివరకు మొత్తంగా దొరికిన 43 డెడ్‌బాడీలు
  • 34 మృతదేహాలుకుటుంబసభ్యులకు అందజేత

సంగారెడ్డి, వెలుగు :  సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి వారం రోజులు అవుతున్నా ఏడుగురు కార్మికుల ఆచూకీ ఇంకా దొరకడం లేదు. శుక్రవారం వరకు 39 మంది డెడ్‌బాడీలను గుర్తించగా, శనివారం మరో నాలుగు మృతదేహాలు లభించాయి. మిగిలిన ఏడుగురిని సైతం గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది ఫ్యాక్టరీలో అణువణువూ గాలిస్తున్నారు. మరో వైపు ఆ ఏడుగురు కాలిబూడిదై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు 43 డెడ్‌బాడీలు 

సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు దొరికిన డెడ్‌బాడీల సంఖ్య 43కు చేరుకుంది.  డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా 34 డెడ్‌బాడీలను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మిగిలిన తొమ్మిది మృతదేహాల డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. శనివారం నాలుగు డెడ్‌బాడీలు పూర్తిగా మాంసం ముద్దలుగా దొరికాయి. ఇప్పటివరకు జరిపిన డీఎన్‌ఏ రిపోర్ట్స్‌తోనూ అవి మ్యాచ్‌ కాకపోవడంతో ఎవరివో గుర్తించడం కష్టంగా మారింది. 

కొనసాగుతున్న సహాయక చర్యలు

పేలుడు ధాటికి పరిశ్రమ లోపల ఏర్పడిన శిథిలాలను రెస్క్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో తొలగించారు. వీటిని పక్కనే మరో చోట డంప్‌ చేసిన తర్వాత.. అందులో గాలిస్తుండగా రెండు ఎముకలు బయటపడ్డాయి. దీంతో ఇంకా ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమోననే అనుమానంతో రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. అయితే శిథిలాల తొలగింపు నిరంతరాయంగా కొనసాగుతున్నా, ఇంకా ఏడుగురి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. 

వారిని గుర్తించే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తామని సంగారెడ్డి కలెక్టర్‌ ప్రావీణ్య తెలిపారు.  కనిపించకుండా పోయిన ఏడుగురిలో ఐదుగురి పేర్లు, ఫొటోలను ఆఫీసర్లు రిలీజ్‌ చేశారు. ఇందులో అఖిలేశ్, విజయ్, వెంకటేశ్‌, జస్టిన్, శివాజీ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబాలు తాత్కాలిక వసతిలోనే ఉంటూ.. తమ వాళ్ల ఆచూకీ  కోసం  కన్నీరు మున్నీరవుతున్నారు. 

20 సెల్‌ఫోన్లు లభ్యం

సిగాచి కంపెనీలోని లాకర్లలో ఆఫీసర్లకు 20 ఫోన్లు దొరికాయి. అవి కంపెనీలో పని చేసే రోజువారీ కార్మికులవేనని నిర్ధారించిన ఆఫీసర్లు ఇప్పటివరకు 14 ఫోన్లను ఆయా కార్మికుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన ఆరు ఫోన్లను కూడా శనివారం గుర్తించినప్పటికీ సంబంధీకులు వచ్చే వరకు వాటిని భద్రపరుస్తామని ఆఫీసర్లు చెప్పారు.