కోల్​కతాలో అండర్ వాటర్ మెట్రో సర్వీసులు షురూ

కోల్​కతాలో అండర్ వాటర్ మెట్రో సర్వీసులు షురూ

కోల్​కతా: బెంగాల్ రాజధాని కోల్ కతాలో అండర్ వాటర్ మెట్రో సేవలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. హౌరా మైదాన్ స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు మొదటి రైలు ప్రారంభమైంది. ఇదే సమయంలో ఎస్​ప్లనేడ్ స్టేషన్ నుంచి ఇంకో రైలు ప్రయాణం మొదలైంది. 4.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రెండు స్టేషన్లలో రైలు ఎక్కేందుకు జనం క్యూ కట్టారు. దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో కావడంతో జర్నీ చేసేందుకు ఉదయానికల్లా వందలాది మంది స్టేషన్లకు చేరుకుని టికెట్ల కోసం లైన్లలో నిల్చున్నారు. 

మెట్రో ఎక్కి సెల్ఫీలు తీసుకున్నారు. రైలు పరుగులు ప్రారంభించగానే ప్యాసింజర్లు ఆనందంతో బిగ్గరగా కేకలు వేశారు. చప్పట్లు కొట్టారు. పలువురు జైశ్రీరాం, వందే భారత్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. నీళ్ల అడుగు నుంచి వెళ్లే ట్రైన్ ఎక్స్​పీరియెన్స్​ను ఆస్వాదించారు. కాగా, హుగ్లీ నది కింద ఈ సొరంగాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. హౌరా మైదాన్  నుంచి ఎస్​ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మెట్రో లైన్​లో 520 మీటర్ల పొడవున్న టన్నెల్​ను నీళ్ల అడుగున నిర్మించారు. మెట్రో రైలు ఈ టన్నెల్​లోంచి 45 సెకన్ల పాటు ప్రయాణిస్తుంది.