
పాలమూరు, వెలుగు : భారత్ మొత్తం మీద తెలంగాణలోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ అన్నారు. దేశంలో పది శాతం నిరుద్యోగులుంటే, రాష్ట్రంలో 15 శాతం మంది నిరుద్యోగులున్నారని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువకుల ఆత్మహత్యల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయలేకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబానికే లాభం కలిగిందని, ప్రజలకు ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. సామాజిక తెలంగాణ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు మోహనకుమార్ మంగళం, సంజీవ్ ముదిరాజ్, మధుసూదన్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.