డబ్బులొద్దు.. జాబ్ ఇవ్వండి!

డబ్బులొద్దు.. జాబ్ ఇవ్వండి!
  • గవర్నమెంటును కోరుతున్న నిరుద్యోగులు 
  • కరోనాతో భారీగా జాబ్ లాస్‌లు
  • పట్టణాల్లో విపరీతంగా పెరుగుదల
  • లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వెల్లడి

సిటీల్లో, టౌన్లలో జాబ్స్‌‌ దొరకడం చాలా కష్టంగా మారిందని, గవర్నమెంటే తమను ఆదుకోవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. డబ్బు సాయంగా ఇచ్చే బదులు జాబ్‌‌ గ్యారంటీ ఇస్తే తమ జీవితాలు బాగుపడతాయని అంటున్నారు. లండన్ స్కూల్‌‌ ఆఫ్‌‌ ఎకనమిక్స్‌‌ చేసిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 82 శాతం మంది జాబ్‌‌ గ్యారంటీ కావాలని కోరారు. మిగతావాళ్లు క్యాష్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసినా చాలని చెప్పారు. 
 

న్యూఢిల్లీ: పట్నంలో పని చేయాలనే కలలను ఇక వదిలేసుకున్నామని, కరోనా కారణంగా ఎక్కడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు కనిపించడం లేదని కార్మికులు బాధపడుతున్నారు. పల్లెటూళ్లలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసినట్టుగా పట్టణాల్లోనూ జాబ్ గ్యారంటీ స్కీమ్‌‌ను తేవాలని కోరుకుంటున్నారు. లండన్‌‌ స్కూల్‌‌ ఆఫ్‌‌ ఎకనమిక్స్‌‌ చేసిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. ఈ సంస్థ రిపోర్టు ప్రకారం..ఉద్యోగాలు లేక ఇప్పటికే పట్టణాల్లో పనిచేసే వారిలో మెజారిటీ కార్మికులు వెళ్ళిపోయారు. తమ ఉపాధికి ప్రభుత్వమే భరోసా ఇవ్వాలని 82శాతం మంది రెస్పాండెంట్లు స్పష్టం చేశారు. నెలనెలా కొంత డబ్బును సాయంగా అందించినా చాలని16 శాతం మంది కోరుకుంటున్నారు.  కరోనా టైమ్‌లో  నిరుద్యోగులకు, ముఖ్యంగా వలస కార్మికులకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నగదును, సరుకులను ఉచితంగా అందించాయి. వీటి కంటే జాబ్‌‌ గ్యారంటీ ఇస్తేనే తమకు మేలని మెజారిటీ రెస్పాండెంట్లు అన్నారు.  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్దిదారులకు ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధికి హామీ ఇస్తుంది. ఊళ్లోని ప్రతి ఇంట్లో ఒకరికైనా తప్పనిసరిగా కూలీ పని ఇస్తారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ స్కీమ్‌‌కు బడ్జెట్ కేటాయింపులను  50 శాతం పెంచింది.

రిస్ట్రిక్షన్లు తగ్గినా ఫాయిదా లే...
గత ఏడాది కరోనా ఫస్ట్‌‌ వేవ్‌‌ సమయంలో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌‌డౌన్‌‌ను కఠినంగా అమలు చేసింది. రెండోవేవ్‌‌ సమయంలో మాత్రం లాక్‌‌డౌన్‌‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసింది.  దీంతో ఎకానమీ పోయిన ఏడాది స్థాయిలో దెబ్బతినలేదు. అయినప్పటికీ తమకు ఇప్పటికీ పని దొరకలేదని 40 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పారు. మొదటి లాక్‌డౌన్‌‌ నుండి ఇప్పటి వరకు.. అంటే పది నెలలుగా రికామీగా ఉన్నామని అన్నారు. మిగతా వర్గాల కంటే యువతలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది.  సర్వే కోసం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య 4,763 మంది నుంచి వివరాలు తీసుకున్నారు. తక్కువ ఆదాయం కలిగిన బీహార్, జార్ఖండ్  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల కార్మికులను ఈ సర్వే కోసం ఎంచుకున్నారు.

సర్వే హైలెట్స్‌‌ 

  •  పట్టణాల్లో కార్మికుల్లో చాలా మంది గత ఆరు నెలలుగా పని లేక ఇబ్బందిపడుతున్నారు.  కొంతమంది అయితే గత పది నెలల నుంచి రికామీగా ఉంటున్నారు. 
  •  పూర్తి సంవత్సరం పని చేసిన ఉద్యోగుల సంఖ్య సగానికి తగ్గింది. మిగతా కార్మికుల పని వారంలో కనీసం ఆరు గంటలు తగ్గింది. దీంతో జీతం తగ్గింది. 
  •  ఈఎస్‌‌ఐ, పీఎఫ్‌‌ వంటి స్కీములు తక్కువ ఆదాయం గల పట్టణ ప్రాంతాల కార్మికులకు అందలేదు.  ఇలాంటి బెనిఫిట్లు పొందామని ఒక శాతం కన్నా తక్కువ మంది రెస్పాండెంట్లు మాత్రమే చెప్పారు. 
  •  అన్‌ప్లాయ్‌‌మెంట్‌‌ మే నెలతో పోలిస్తే జూన్‌‌లో 11.9 శాతం నుంచి 9.19 శాతానికి తగ్గిందని సెంటర్‌‌ ఫర్ మానిటరింగ్‌‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) ప్రకటించింది.
  •   దేశమంతటా కరోనా, లాక్‌‌డౌన్‌‌ల వల్ల 40 శాతానికిపైగా ఉద్యోగుల జీతం  తగ్గిందని ఈ సంస్థ సర్వే వెల్లడించింది.