హైదరాబాద్: షేక్‌పేట తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక బదిలీ అన్యాయమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ఖండించింది. అకారణంగా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వక పోవడం దారుణమంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. రాత్రి పగలు పని చేసినా రెవెన్యూ శాఖలో జరుగుతున్న సంఘటనల పై తీవ్ర అసంతృప్తి చేయడంతోపాటు.. కక్ష సాధింపులా చేసిన బదిలీని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసింది. తాహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ జిల్లా నుండి అకారణంగా రాత్రి సమయంలో బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనుక కొందరు నాయకుల ఒత్తిడి ఉన్నట్టు తెలిసిందని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు రెవెన్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు వెంటనే హైదరాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని ట్రెసా నేతలు డిమాండ్ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాత్రిo పగళ్లు పని చేసి ధరణితో పాటు ప్రజలకు రెవెన్యూ సేవలు అందిస్తున్నప్పటికీ రెవెన్యూ శాఖలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచి వేస్తున్నాయని ట్రెసా ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రోజుల క్రితం జరిగిన నాయబ్ తహసీల్దార్లు తహసీల్దార్లుగా పదోన్నతులు పొంది జిల్లా కేటాయింపులో ఇష్టరాజ్యంగా ఉత్తర్వులు ఇచ్చారని, కొత్తగా గ్రూప్ -2 ద్వారా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకు పోస్టింగ్స్ ఇవ్వడం లేదని, డిఆర్వో పోస్టులు భర్తీ చేయడం లేదని,ముఖ్యమంత్రి గారు ఆదేశించినా పదోన్నతులు పూర్తికాలేదని కొందరు అధికారుల తీరుపై ట్రెసా అసంతృప్తి వ్యక్తం చేసింది.దీనికి కారణం ప్రత్యేకంగా రెవెన్యూ శాఖకి సీసీఎల్ఏ మరియు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోవడమేనని…దీనిపై త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్ మరియు ట్రెసా రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

