- పరేషాన్లో ఆశావహులు
- ముందస్తుగా ఖర్చు చేసిన నేతలకు నిరాశే
కామారెడ్డి, వెలుగు : బల్దియాలో అడుగు పెట్టి చక్రం తిప్పాలని రెండేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్న పలువురు లీడర్లకు రిజర్వేషన్లు షాకిచ్చాయి. ఆయా వార్డుల్లో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మాజీ కౌన్సిలర్లు, ఆశావహులు చాలారోజుల ముందునుంచే ప్రయత్నాలు చేశారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. కొందరు అప్పులు చేసీ మరీ భారీగా ఖర్చు చేశారు. రిజర్వేషన్లు కలిసి రాకపోవటంతో ఇప్పుడు లదోదిబోమంటున్నారు.
తాము ఆశించిన వార్డులు మహిళలకు రిజర్వ్ అయిన చోట వారు తమ భార్యలను, తల్లులు పోటీకి దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాజకీయాలంటే తెలియని కుటుంబసభ్యులను పోటీకి ఒప్పించేందుకు తంటాలు పడుతున్నారు. మున్సిపాలిటీల పాలక వర్గం గడువు ఏడాది కిందటే ముగిసింది.
ఎన్నికలు వెంటనే వస్తాయని భావించి పాలక వర్గం గడువు ముగియకముందునుంచే కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు పలువురు లీడర్లు రెడీ అయ్యారు. వార్డుల్లో తమ పట్టును పెంచుకునేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేశారు. కొందరు వార్డుల్లో బోర్లు తవ్వించటం, మోటార్ల బిగించడం, నీటి సరఫరాకు ట్యాంకర్లు ఏర్పాటు చేయడం లాంటి సేవలు అందించారు. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు భారీగా చందాలు ఇచ్చారు. అన్నదానాలు చేశారు. కొందరు తమ ఏరియాలో ఉన్న అన్ని మండపాలకు సంబంధించి అన్ని ఖర్చులు భరించారు.
కొన్ని వార్డుల్లో ఇంటి ఓనర్ పేరుతో నంబర్ ప్లేట్లు చేయించారు. కాలనీల్లో సంఘాలకు ఫర్నీచర్, ఇతర సామాగ్రి కొనిచ్చారు. రోడ్లు, డ్రైనేజీలను క్లీన్ చేయించారు. వార్డుల్లో ఆటల పోటీలు పెట్టారు. ఆశావహులు తమ ఏరియాల్లో ఇప్పటికే రూ. 5 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేసినట్టు చెప్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. తాము ఖర్చు పెట్టుకున్న వార్డుల్లో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా లేకపోవడంతో పెట్టిన ఖర్చు వృధా అయ్యిందని వాపోతున్నారు.
