మనం ఎన్నటికీ మర్చిపోలేని 5 స్కామ్‌‌లు

మనం ఎన్నటికీ మర్చిపోలేని 5 స్కామ్‌‌లు
  • ఇవి ఇండియా ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయ్‌ …
  • లొసుగులతో నేరగాళ్లు ఇన్వెస్టర్ల సంపదను మింగేశారు
  • ఇల్లీగల్​ ఇన్వెస్ట్​మెం ట్లతో రూ.వేల కోట్ల మోసాలు
  • షేర్ల ధరల రిగ్గింగ్ కంపెనీ అకౌంట్స్ తారుమారు

బిజినెస్‌‌ డెస్క్, వెలుగు: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల మనీని కాపాడేందుకు, మార్కెట్లలో సురక్షితమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్‌‌ ఆఫ్ ఇండియా(సెబీ) ఎప్పటికప్పుడు పలు రూల్స్‌‌ను తీసుకొస్తూనే ఉంటుంది. మార్కెట్లను రెగ్యులేట్ చేస్తూ.. మోసాలకు అవకాశాలు లేకుండా చేస్తోంది. అయినప్పటికీ మోసగాళ్లు ఏ చిన్న చాన్స్‌‌ దొరికినా, దానిని ఆధారం చేసుకొని భారీ స్కామ్‌‌లు చేస్తున్నారు. ఇలా సిస్టమ్‌‌లో ఉన్న లొసుగులను వాడుకొని ఆర్థిక నేరాళ్లకు పాల్పడిన వారిలో ఐదుగురు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. వీరి స్కామ్‌లు  ఇండియన్ చరిత్రలో ఎప్పటికీ  గుర్తుండిపోతాయి. అవేమిటో మార్కెట్ ఎక్స్‌‌పర్ట్, గ్రోవ్‌‌ సీఓఓ, కో ఫౌండర్ హర్ష్ జైన్ మాటల్లో ఓ సారి చూద్దాం..

కేతన్ పరేఖ్ స్కామ్…

కేతన్ పరేఖ్ ఒక చార్టెడ్ అకౌంటెంట్. హర్షద్‌‌ మెహతా సంస్థ గ్రోమోర్ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌లో పనిచేసేవాడు. మెహతా వారసుడిగా కేతన్‌‌కు పేరుంది. షేర్ల రిగ్గింగ్‌‌లో మెహతా టెక్నిక్స్‌‌నే కేతన్ పరేఖ్ కూడా అవలంబించాడు. ఇతడు కూడా బ్యాంక్‌‌లు, ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ నుంచి మనీ తీసుకొచ్చి, వాటిని ఇల్లీగల్‌‌గా స్టాక్స్‌‌లో పెట్టుబడి పెట్టాడు. అలా ఆ స్టాక్స్ ధరలు పెరిగేలా చేశాడు. కే–10 స్టాక్స్‌‌లో కేతన్ పరేఖ్ ఇన్వెస్ట్ చేశాడు. వాటిలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్, ముక్తా ఆర్ట్స్, టిప్స్, ప్రీతిశ్‌‌ నందీ కమ్యూనికేషన్స్, జీటీఎల్, జీ టెలిఫిల్మ్స్, పెంటామీడియా గ్రాఫిక్స్, క్రెస్ట్ కమ్యూనికేషన్స్, ఆప్టెక్‌‌ ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఈ కే–10 స్టాక్స్ ఒక్కసారిగా బేర్స్‌‌ను తాకడంతో.. రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయి. కేతన్ పరేఖ్ మోసం 2001లో సెన్సెక్స్ 176 పాయింట్లు పడిపోవడంతో వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టిగేషన్‌‌లో ఈయన స్కామ్ వివరాలు బయటపడ్డాయి. ఈ స్కామ్ బయటపడటంతో ఆయన తను కొన్న షేర్లన్నింటినీ అమ్మి.. మార్కెట్ క్రాష్ అయ్యేలా చేశాడు.

సత్యం స్కామ్…

2009లో అతిపెద్ద కార్పొరేట్ స్కామ్ ఇది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్(ఎస్‌‌సీఎస్‌‌ఎల్) ఛైర్మన్, ఇతర సీనియర్ మెంబర్లు కూడా సెబీ వద్ద తమ తప్పును ఒప్పుకున్నారు. 2003 నుంచి 2008 మధ్య కంపెనీ అకౌంట్లను తారుమారు చేసి సేల్స్, ప్రాఫిట్స్ పెరిగినట్టు చూపించినట్టు చెప్పారు. ఈ మోసం విలువ రూ.7 వేల కోట్లు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) కంపెనీ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. వారిపై సంబంధిత ఛార్జ్‌‌ షీట్లను దాఖలు చేసింది. ఈ స్కామ్‌‌లో ఇన్‌‌వాల్వ్ అయిన ఛైర్మన్‌‌, ఇతర సీనియర్ మెంబర్లందరూ జైలుకి వెళ్లారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్‌‌ను మహీంద్రా గ్రూప్ టేకోవర్ చేసింది. ఆ తర్వాత దీని పేరుని మహీంద్రా సత్యంగా మార్చింది.

నీరవ్ మోడీ స్కామ్​

బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నీరవ్ మోడీ స్కామ్ పెద్ద సంచలనం.   పీఎన్‌‌బీకి రూ.11,300 కోట్ల వరకు కన్నం వేశాడు ఈ  జ్యూయలర్‌‌. ముంబైలోని పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంకు తప్పుడు విధానంలో లెటర్స్ ఆఫ్ అండర్‌‌‌‌టేకింగ్(ఎల్‌‌ఓయూలు) తీసుకుని, వాటి ద్వారా ఇండియన్ లెండర్ల నుంచి విదేశాల్లో అప్పులు తీసుకున్నాడు. కొన్ని  అనధికారిక లావాదేవీలు గుర్తించినట్టు పీఎన్‌‌బీ 2018లో సెబీ, సీబీఐకి రిపోర్ట్ చేసింది. ఈ ఫ్రాడ్ వెలుగులోకి రాగానే పీఎన్‌‌బీ షేర్లు దివాలా తీశాయి. ఈ స్కాంలో భాగమైన నీరవ్ మోడీని, ఆయన మేనమామ, గీతాంజలి జెమ్స్ సీఎండీ మెహుల్ చోక్సీని అరెస్ట్ చేద్దామనుకునే లోపే, వారు దేశం విడిచి పారిపోయారు. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది.

హర్షద్ మెహతా స్కామ్..

ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న అతిపెద్ద స్కామ్‌‌లలో ఇదీ ఒకటి. ‘సెక్యూరిటీ స్కామ్‌‌’గా పిలువబడే ఈ మోసం విలువ సుమారు రూ.3,500 కోట్లు. హర్షద్ మెహతా.. ఒక స్టాక్ బ్రోకర్.  మెహ‌‌తా కొన్ని బ్యాంకుల నుంచి న‌‌కిలీ ర‌‌సీదుల ద్వారా, మరికొన్ని బ్యాంకుల నుంచి అప్పుల కింద డబ్బులు సేక‌‌రించి ఆ సొమ్మును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. దీంతో మార్కెట్లు విపరీతంగా పెరిగేవి. దీంతో ఈయన్ని చాలా మంది ఫాలో అయ్యే వారు. ఆయన కొన్న స్టాక్‌లోనే ఇన్వెస్ట్ చేసేవారు. స్టాక్‌లు గరిష్టాలకు చేరాక ఆ స్టాక్‌లను భారీ లాభాల వద్ద అమ్మేసి స్టాక్‌ ధరను సడెన్‌గా పడేసే వాడు.  అయితే ఆయా బ్యాంకుల వద్ద లోన్‌‌ తీసుకునేటప్పుడు అతడు హామీగా ఉంచిన పత్రాలన్నీ నకిలీవి, ఏమాత్రం విలువలేనివి. ఇతడు బ్యాంకుల డబ్బును ఏప్రిల్ 1991 నుంచి మే 1992 మధ్యలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్‌‌ లిస్టెడ్ స్టాక్స్‌‌లో ఇల్లీగల్‌‌గా ఇన్వెస్ట్ చేశాడు. దీంతో బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 1,194 పాయింట్ల నుంచి ఏకంగా 4,500 పాయింట్ల వరకు పెరిగింది. 274 శాతం రిటర్న్స్‌‌ పొందింది. మార్కెట్లు కంటిన్యూగా కొత్త గరిష్టాలను తాకుతుండటంతో ఆయన్ను అందరూ బిగ్ బుల్‌‌ అంటూ ప్రశంసించేవాళ్లు. ఆయన ఏ స్టాక్స్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేస్తే వాటిని విపరీతంగా కొనేవారు. 1992 ఆగస్ట్‌‌లో స్టేట్ బ్యాంక్   ప్రభుత్వ సెక్యూరిటీస్‌‌లో రూ.3,500 కోట్ల లోటును పసిగట్టింది.  దీంతో స్కామ్ బయటపడింది. 1992లోనే ఆయన కటకటాల పాలయ్యాడు. అదే జైలులో 2001లో గుండెపోటుతో హర్షద్‌‌ మెహతా మరణించాడు.

నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్(ఎన్‌‌ఎస్‌‌ఈఎల్) స్కామ్..

ఎన్‌‌ఎస్‌‌ఈఎల్ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇది అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ కమోడిటీస్‌‌లో ట్రేడింగ్‌‌కు అనుమతిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఫౌండర్ జిగ్నేష్ షా.  స్టాక్ ఎక్స్చేంజ్ మాదిరే, ఈ కమోడిటీ ఎక్స్చేంజ్‌‌లోనూ బయర్‌‌, సెల్లర్ ఒకరికి ఒకరు తెలియరు. ఒకసారి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక.. కమోడిటీ బయర్‌‌కు డెలివరీ అవుతుంది. ఎన్‌‌ఎస్‌‌ఈఎల్ పలువురు రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయంగా మారింది. వారి ఇన్వెస్ట్‌‌మెంట్లపై మంచి రిటర్న్‌‌లు రావడంతో చాలా మంది దీనికి ఆకర్షితులయ్యారు. పెయిర్డ్ కాంట్రాక్ట్‌‌లపై ఫిక్స్‌‌డ్ రిటర్న్‌‌లు పొందేవారు. పెయిర్డ్ కాంట్రాక్ట్‌‌ల ద్వారా  వచ్చే మనీ అంతా ఈ ఎక్స్చేంజ్‌‌లోని ఉండిపోయేది. దీంతో స్కామ్‌‌కి తెరలేచింది. ఈ విషయం తెలుసుకున్న ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఎన్‌‌ఎస్‌‌ఈఎల్‌‌కు కొత్త ఆర్డర్లు రాకుండా ఆపేసింది. అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వారికి ఎన్‌‌ఎస్‌‌ఈఎల్ చెల్లింపులు చేయక తప్పలేదు. అలా చెల్లింపులు చేస్తూ ఉండటంతో… ఎన్‌‌ఎస్‌‌ఈఎల్ దివాలా తీసింది.