ఇండ్లలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి

ఇండ్లలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి
  •  2 గంటలు హైడ్రామా అనంతరం అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హైవే పనులు చేసేందుకు వచ్చిన ఒడిశాకు చెందిన సహదేవ్‌‌‌‌గా గుర్తింపు

మోత్కూరు, వెలుగు : ఇండ్లలోకి చొరబడుతూ హంగామా సృష్టించిన ఓ వ్యక్తిని గ్రామస్తులు, పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో బుధవారం కలకలం సృష్టించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఉదయం అనాజిపురంలోని జంగాల కాలనీలో ఉన్న ఓ ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. అతడిని చూసి భయపడిన ఇంట్లో వాళ్లు బయటకు వచ్చి ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పారు. దీంతో కాలనీవాసులంతా అక్కడికి రావడంతో అను ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి మరో ఇంట్లోకి దూరాడు.

 అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, యువకులు అతడిని చిన్నపిల్లల కిడ్నాపర్‌‌‌‌గా భావించి పట్టుకునేందుకు వెంబడించగా గ్రామంలోని ఓ తోటలో ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. పట్టుకునేందుకు వెళ్లిన గ్రామస్తులపై ఇనుపరాడ్డు, కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు, యువకులు తోటలో అతను దాక్కున్న ఇంటిని చుట్టుముట్టారు. 

సుమారు రెండు గంటల హైడ్రామా తర్వాత గ్రామస్తుల సహకారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీ చేయగా అతడు ఒడిశాకు చెందిన సహదేవ్‌‌‌‌ మజీ అని, నేషనల్‌‌‌‌ హైవే పనులు చేస్తున్న వీడీబీ కంపెనీలో లేబర్‌‌‌‌ అని గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేక ఇండ్లలోకి దూరాడని పోలీసులు తెలిపారు.