పీఎం కిసాన్ సంపద యోజనకు .. బడ్జెట్ రూ.6,520 కోట్లకు పెంపు

పీఎం కిసాన్ సంపద యోజనకు .. బడ్జెట్ రూ.6,520 కోట్లకు పెంపు
  • కో-ఆపరేటివ్ సొసైటీల అభివృద్ధికి రూ.2 వేల కోట్లు
  • ఆరు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణకు రూ.11 వేల కోట్లు
  • కేంద్ర కేబినెట్ నిర్ణయాలు 

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌‌‌‌ గురువారం రైతులు, కో-ఆపరేటివ్ సొసైటీలకు ఊరట కల్పిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (పీఎంకేఎస్‌‌‌‌వై) బడ్జెట్‌‌‌‌ను రూ.4,600 కోట్ల నుంచి రూ.6,520 కోట్లకు పెంచింది. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌‌‌‌సీడీసీ)కి 2025-–26 నుంచి 2028-–29 వరకు నాలుగేళ్లకు రూ.2,000 కోట్ల గ్రాంట్‌‌‌‌-ఇన్‌‌‌‌- ఎయిడ్‌‌‌‌ మంజూరు చేసింది. అలాగే, ఆరు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణకు రూ.11,169 కోట్లు కేటాయించింది. పీఎంకేఎస్‌‌‌‌వై కింద ఈ ఏడాది అదనంగా రూ.1,920 కోట్లతో 50 మల్టీ-ప్రొడక్ట్ ఫుడ్ ఇరాడియేషన్ యూనిట్లు, 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌‌‌‌లు ఏర్పాటు చేస్తారు. 

ఇందులో ఇరాడియేషన్ యూనిట్లకు, ల్యాబ్‌‌‌‌ల కోసం రూ.1,000 కోట్లు, మిగిలిన రూ.920 కోట్లు వివిధ పథకాల ప్రాజెక్టులకు వినియోగిస్తారు. అలాగే ఎన్‌‌‌‌సీడీసీకి రూ.2 వేల కోట్ల గ్రాంట్‌‌‌‌తో రూ.20 వేల కోట్లు మార్కెట్ నుంచి సమీకరించి, కో-ఆపరేటివ్ సొసైటీలకు రుణాలు ఇవ్వనున్నారు. దీంతో 13,288 సొసైటీలలోని 2.9 కోట్ల మంది సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆరు రాష్ట్రాల్లో 574 కి.మీ. రైల్వే లైన్ల విస్తరణకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇవి 2,309 గ్రామాలకు కనెక్టివిటీ కల్పిస్తాయి. ఏటా 95.91 మిలియన్ టన్నుల ఫ్రైట్ ట్రాఫిక్ పెరుగుతుందని కేంద్ర కేబినెట్ పేర్కొంది.