టెర్రరిజాన్ని వదిలిపెట్టే దాకా.. పాక్‎కు సింధూ జలాలిచ్చేదే లేదు: మంత్రి జైశంకర్

టెర్రరిజాన్ని వదిలిపెట్టే దాకా.. పాక్‎కు సింధూ జలాలిచ్చేదే లేదు: మంత్రి జైశంకర్

న్యూఢిల్లీ: టెర్రరిజాన్ని వదిలిపెట్టే దాకా పాకిస్తాన్‎కు సింధూ జలాలు ఇచ్చే ప్రసక్తేలేదని కేంద్ర మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవన్నది గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్​పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలను కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు.

 ప్రపంచంలో ఏదేశం కూడా.. తన నదీ జలాలను.. వాటిపై ఉన్న హక్కులను మరొక దేశానికి వదులుకోదని చెప్పారు. గత కాంగ్రెస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. ‘‘నెహ్రూ చేసిన తప్పులను ఎన్డీయే ప్రభుత్వం సరిదిద్దుతున్నది. సింధూ జలాల ఒప్పందంపై నెహ్రూ సంతకం చేసింది బుజ్జగింపు కోసమే.. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మేలు చేశాం’’ అని జైశంకర్ అన్నారు.

ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు

ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌ను ఆపాలని ఏ దేశం ఇండియాను కోరలేదని జైశంకర్ స్పష్టం చేశారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇండియాను పాకిస్తాన్ అడుక్కున్నది. ఎంతో రిక్వెస్ట్ చేస్తే తప్పా.. సీజ్​ఫైర్‎కు ఇండియా ఒప్పుకోలేదు. ఇందులో ఏ దేశం మధ్యవర్తిత్వం వహించలేదు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 16 వరకు మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ లేదు. పహల్గాం దాడితో పాకిస్తాన్ రెడ్ లైన్ దాటింది. తగిన రీతిలో 
బుద్ధి చెప్పాం’’ అని జైశంకర్ హెచ్చరించారు.

రాహుల్.. ‘చైనా గురువు’

ఇండియా భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని జైశంకర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండించారు. ‘రాహుల్.. చైనా గురువు. బీజింగ్‎లో జరిగిన ఒలింపిక్స్‎కు రాహుల్ అటెండ్ అయ్యాడు. చైనా రాయబారి నుంచి స్పెషల్ ట్యూషన్లు తీసుకున్నాడు. అందుకే చైనా గురించి ఆయనకు చాలా విషయాలు తెలుసు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు’’ అని జైశంకర్ అన్నారు.

రాజ్యసభలో ‘సర్’ రగడ

రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే.. బిహార్‎లో చేపడ్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై చర్చించాలని అపోజిషన్ పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. సభలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కోరినా వినిపించుకోలేదు. కాగా, సాయంత్రం ప్రతిపక్షాలు బాయ్ కాట్​ చేశాయి.