ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ నార్త్‌‌‌‌ మరింత ఆలస్యం! ..నిధుల మంజూరుకు ఆమోదం తెలపని కేంద్ర ఆర్థిక శాఖ

ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ నార్త్‌‌‌‌  మరింత ఆలస్యం! ..నిధుల మంజూరుకు ఆమోదం తెలపని కేంద్ర ఆర్థిక శాఖ
  •     పీఎం మోదీ అధ్యక్షతన ఇటీవల కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ భేటీ
  •      ఇప్పటికే మూడుసార్లు టెండర్లు పిలిచిన ఆఫీసర్లు
  •     ఫైనాన్షియల్‌ అప్రూవల్‌ వస్తేనే పనులకు మోక్షం

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్‌ చుట్టూ నిర్మించే ట్రిపుల్‌ ఆర్‌ నార్త్‌ పనులు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. రోడ్డు నిర్మాణానికి గతంలోనే అనుమతులు ఇచ్చిన కేంద్రం.. ఫైనాన్షియల్‌ అప్రూవల్‌ విషయంలో మాత్రం ఆలస్యం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ రోడ్డు నిర్మాణానికి నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్​ఇండియా  (ఎన్‌హెచ్‌ఏఐ) ఇంజినీర్లు ఇప్పటికే మూడు సార్లు టెండర్లు పిలిచారు. పీఎం మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) మీటింగ్‌లో ట్రిపుల్‌ నార్త్‌ పనులకు సంబంధించిన నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో టెండర్లు మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కేంద్రం నుంచి ఫైనాన్షియల్‌ అప్రూవల్‌ వస్తేనే పనులకు మోక్షం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

రెండు ప్యాకేజీలు రూ. 9,361 కోట్లు..

ట్రిపుల్‌‌‌‌ నార్త్​ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించిన ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ, పనులకు సంబంధిచి గత నెల 20న టెండర్లను పిలిచింది. ప్యాకేజీ-1లో సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్‌‌‌‌ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.518 కిలోమీటర్ల వరకు రూ.4,918 కోట్లతో,  ప్యాకేజీ-2లో ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 78 కిలోమీటర్ల పనులు చేపట్టేందుకు రూ. 4,443 కోట్లకు టెండర్లను ఆహ్వానించింది. బిడ్ల సమర్పణకు జూలై 7 వరకు గడువు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు మే నెలలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌‌‌‌ షిప్​అప్రైజల్ కమిటీ ఆమోదం లభించింది. నిధులకు పీఎం మోదీ అధ్యక్షతన జరిగే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌‌‌‌ కమిటీ (సీసీఈఏ) నుంచి ఆమోదం లభిస్తే కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకోవడానికి అవకాశం దక్కుతుంది. కానీ ఇటీవల జరిగిన సీసీఈఏ మీటింగ్‌‌‌‌లో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ -63, ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌563 రోడ్లకు సంబంధించిన నిధులకు మాత్రమే అప్రూవల్‌‌‌‌ ఇచ్చారు. ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ నార్త్‌‌‌‌ పనులకు సంబంధించిన రూ.9,361 కోట్లకు ఈ కమిటీ ఆమోదం తెలపలేదు. 

రెండేండ్లలో మూడుసార్లు టెండర్లు.. 

సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం, హై-స్పీడ్‌‌‌‌ రవాణా కారిడార్‌‌‌‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం చేపట్టిన భారత్‌‌‌‌మాల –1 ప్రాజెక్ట్‌‌‌‌లో భాగంగా హైదరాబాద్‌‌‌‌ చుట్టూరా రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు నిర్మించాలని 2017లో ప్రతిపాదించింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ  ట్రాఫిక్‌‌‌‌ను మళ్లించడం, అంతర్రాష్ట్ర కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించడం, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులకు అనుసంధానించడం ఈ ప్రాజెక్ట్‌‌‌‌ ముఖ్య ఉద్దేశం. మొత్తం 343.5 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన రోడ్డును రెండు పార్టులుగా విభజించారు. నార్త్‌‌‌‌ పార్ట్‌‌‌‌ 161.5 కిలోమీటర్లు, సౌత్‌‌‌‌ పార్ట్‌‌‌‌ కింద 182 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి నిర్ణయించారు.

 మొదట నార్త్‌‌‌‌ పనులు పూర్తి చేసేందుకు డీపీఆర్‌‌‌‌ రెడీ చేశారు. నాలుగు లైన్లతో ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే నిర్మించాలని నిర్ణయించి.. రూ.7,104.06 కోట్లతో 2024 డిసెంబర్‌‌‌‌లోనే టెండర్లు పిలిచారు. ఆ తర్వాత పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రిపుల్‌‌‌‌ ఆర్‌‌‌‌ను ఆరు వరుసలుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అధికారులు 2025లో రీ ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేశారు. ఈపీసీ విధానం నుంచి హ్యామ్‌‌‌‌ విధానానికి మార్చి రీ టెండర్లు పిలిచారు. అయితే టెండర్ల ప్రక్రియకు కావాల్సిన డాక్యుమెంట్లను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయకపోవడంతో ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఇదిలా ఉండగా.. పనులను రెండు ప్యాకేజీలకు కుదిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రహదారికి ‘ఎన్‌‌‌‌హెచ్-161ఏఏ’ నంబరును కేటాయించారు. తాజాగా మూడోసారి టెండర్లను మార్చేశారు. ఐదు ప్యాకేజీలను రెండు ప్యాకేజీలుగా మార్చి రూ.9,361 కోట్లకు మరోసారి టెండర్లు పిలిచారు. గడిచిన రెండేండ్లలో మూడు సార్లు టెండర్లు పిలిచినా.. పనులకు అవసరమైన ఫైనాన్షియల్ అప్రూవల్ రాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.