
స్టేషన్ ఘన్ పూర్, వెలుగు: సీఎం కేసీఆర్ కు ఈడీ భయం పట్టుకుందని, రోజుకు ఆరేడు పెగ్గులు తాగి ప్రగతిభవన్‌లో నిద్రపోతున్నాడని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ ప్రజలను గాలికొదిలేశాడు కాబట్టే తాము ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా దగ్గరవుతున్నామన్నారు. మునుగోడులో కేసీఆర్ సభ వెలవెలబోయిందని, బీజేపీ సభకు జనం జాతరను తలపించిందని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికతోనే టీఆర్ఎస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందన్నారు. కూలీ పని చేసి, మద్యం తాగితే పోలీసులు ఫైన్లు వేస్తున్నారని, అదే కేసీఆర్ మందుతాగి పరిపాలన చేస్తే ఏం శిక్ష వేయాలో ప్రజలే తేల్చాలన్నారు. కేసీఆర్ ను మరోసారి గెలిపిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్వాళ్లను తీసుకొచ్చి హైదరాబాద్‌లో మీటింగ్‌లు పెట్టిస్తాడని ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెట్టకున్నా కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, దమ్ముంటే కేసీఆర్ దీనిపై వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు. లేదంటే కేసీఆర్ అంతు చూస్తామని హెచ్చరించారు.
స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధి బీజేపీతోనే..
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్ అన్నారు. నియోజవర్గానికి 100 బెడ్ల హాస్పిటల్, డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామన్న కేసీఆర్ పత్తా లేకుండా పోయారన్నారు. ఈ నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కింద రూ.107కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ.53 కోట్లు, మొక్కల పెంపకం కోసం రూ.26 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.53 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.19 కోట్లు మంజూరు చేసిందన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు అన్నీ పాడు బుద్ధులే ఉన్నాయని, మహిళలతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదని విమర్శించారు.
కార్యక్రమంలో మాజీ మంత్రి డా గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేశ్, బొజ్జప్పల్లి సుభాశ్, నియోజకవర్గ ఇన్చార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఇనుగాల యుగేందర్‌రెడ్డి, గట్టు క్రిష్ణ తదితరులున్నారు.
పాదయాత్ర సాగిందిలా..
ప్రజాసంగ్రామ యాత్ర 19వ రోజు స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండలో ప్రారంభమైంది. అనంతరం చాగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి మీదుగా పాంనూరు వరకు సాగింది. బండి సంజయ్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలను ఎగరేశారు. ఆయా గ్రామాల్లో పార్టీ శ్రేణులు బండి సంజయ్‌కి ఘన స్వాగతం పలికాయి. స్టేషన్ ఘన్ పూర్లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు బొజ్జపల్లి సుభాశ్దాతగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు.