కాంగ్రెస్, బీఆర్ఎస్..మజ్లిస్ ఒకే గూటి పక్షులు

కాంగ్రెస్, బీఆర్ఎస్..మజ్లిస్ ఒకే గూటి పక్షులు
  • ఇలాంటి పార్టీలు తెలంగాణకు అవసరం లేదు : అమిత్ షా
  • బీఆర్​ఎస్​కు ఓ విధానమంటూ లేదని ఫైర్​
  • సికింద్రాబాద్‌‌లో మేధావుల సదస్సు
  • కుటుంబ పాలన సాగిస్తున్న ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో పక్కన కూర్చోబెట్టుకోం

హైదరాబాద్, వెలుగు : కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను సీఎం చేయడానికి.. కవిత జైలుకు పోకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేయడం తప్ప.. ఆయనకు సిద్ధాంతం అంటూ ఏముందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్‌‌‌‌కు ఓ విధానం అంటూ లేదు. అది కుటుంబ పార్టీ. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవు. బీజేపీ మాత్రమే సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తున్న పార్టీ” అని స్పష్టం చేశారు. ‘‘కుటుంబ పాలన సాగిస్తూ.. అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పక్కన కూర్చోబెట్టుకోదు. మజ్లిస్‌‌‌‌తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎన్నటికీ దగ్గరకు రానివ్వదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. ఇలాంటి పార్టీలు తెలంగాణకు అవసరం లేదు” అని అన్నారు. 

మంగళవారం సికింద్రాబాద్‌‌‌‌లోని ఓ గార్డెన్‌‌‌‌లో ఏర్పాటు చేసిన మేధావులు, ప్రొఫెషనల్స్ సదస్సుకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పదేండ్లుగా తెలంగాణ అవినీతిలో మునిగిపోయిందని, ఇందుకు కారణమైన బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దని ప్రజలను కోరారు. రాబోయే ఐదేండ్లు మంచి పాలనను ఎవరు ఇవ్వగలరో ఒకసారి విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు. దేశాన్ని ఉన్నత స్థానంలో నిలుపుతున్న మోదీతో తెలంగాణ సమాజం ఉంటుందా? లేక కొడుకును సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో ఉంటుందా? అనేది తేల్చుకోవాలన్నారు.

ఇచ్చిన హామీలెన్ని? నెరవేర్చినవెన్ని?

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని అమిత్ షా కోరారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్​లకు ఓటు వేస్తే.. అవినీతి ప్రభుత్వం వస్తుంది. బీజేపీకి అధికారం ఇస్తే... అభివృద్ధి సర్కార్ ఉంటుంది. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది. మేం అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నాం” అని చెప్పారు. ‘‘కేసీఆర్.. నీకు ఏ మాత్రం ఇమ్మత్ ఉన్నా.. నీ రెండు మేనిఫెస్టోలు చదువు. అందులో ఇచ్చిన హామీలు ఎన్ని? నెరవేర్చిన హామీలు ఎన్ని? అన్నింట్లో పూర్తిగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారు” అని విమర్శించారు. ఈ తొమ్మిదేండ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు రూ.9 లక్షల కోట్ల నిధులిచ్చిందన్నారు. 

ఉద్యమంలో మేధావుల పాత్ర కీలకం : లక్ష్మణ్

తెలంగాణ ఉద్యమంలో మేధావుల పాత్ర కీలకమని, రాష్ట్ర సాధనలో వారి కృషి మరువలేనిదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అనేక మంది కళాకారులు, కవులు, రచయితలు, మేధావులు లక్షలాది మంది ఉద్యమకారులను,  కోట్లాది మంది ప్రజలను చైతన్యం చేశారని చెప్పారు. బీఆర్ఎస్ నియంతృత్వ, అవినీతి పాలనను అంతమొందించేలా ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రకాశ్ జవదేకర్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, ఇంద్రసేనారెడ్డి, ఏవీఎన్ రెడ్డి, రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు, పార్టీ నేతలు, వివిధ రంగాల మేధావులు తదితరులు పాల్గొన్నారు.

గ్రేటర్‌‌‌‌లో ఎక్కువ సీట్లు గెలవాలి

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ నేతలను అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలని సూచించినట్లు సమాచారం. మంగళవారం బేగంపేట్‌‌లోని కాకతీయ ఐటీసీ హోటల్‌‌లో కిషన్ రెడ్డి, ప్రకాశ్ జవదేకర్‌‌‌‌తో తెలంగాణ రాజకీయాల గురించి చర్చించారు. అర్బన్ ఏరియాలో బీజేపీకి మంచి ఫాలోయింగ్ ఉందని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఇది కలిసి రానుందని అమిత్ షా చెప్పినట్లు తెలిసింది. మరోవైపు అమిత్ షా టూర్ షెడ్యూల్ చివరి క్షణంలో మారడంతో హైదరాబాద్‌‌లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ రద్దయింది.