రాష్ట్రానికి ఎన్నిసార్లు రావడానికైనా రెడీ
మీ కోసం ఎంత టైమ్ అయినా కేటాయిస్త
బీజేపీ ముఖ్య నేతల భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలి
కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై పోరాడండి
90 సీట్లలో గెలుపే టార్గెట్‌గా ముందుకెళ్లండి
‘హర్ ఘర్ కమల్’ పేరుతో ప్రతి ఇంటికి వెళ్లాలని సూచన
సెప్టెంబర్ దాకా చేపట్టాల్సిన ప్రోగ్రామ్స్ రోడ్ మ్యాప్ రాష్ట్ర నేతలకు అందజేత
ఢిల్లీలోని నడ్డా నివాసంలో రెండున్నర గంటలు సాగిన మీటింగ్
హైదరాబాద్, వెలుగు : తన ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రానికి ఎన్ని సార్లు రావడానికైనా తాను సిద్ధమని, అధికారంలోకి వచ్చే వరకు ఎంత సమయమైనా కేటాయిస్తానని పార్టీ రాష్ట్ర నేతలకు భరోసా ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇంట్లో తెలంగాణ బీజేపీ మినీ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది. దీనికి నడ్డా అధ్యక్షత వహించగా, అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన సమావేశంలో పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. కోటి ఆశలతో, ఎందరో యువకుల ఆత్మ బలిదానాలతో, ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని షా ఫైర్ అయ్యారు.
తల్లి తెలంగాణను కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి చేసేందుకు, ప్రజా తెలంగాణను సాధించడమే లక్ష్యంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లుగా ఒక కుటుంబం చేతిలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, ఇక్కడి వనరులను ఎలా దోపిడీ చేశారో, ప్రాజెక్టుల పేరుతో ప్రజా ధనాన్ని ఎలా కొల్లగొట్టారో, కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఎలా దారి మళ్లించారో జనానికి వివరించాలని సూచించారు.
బలమైన అభ్యర్థులను సిద్ధం చేయండి
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై రాష్ట్ర నేతలతో అమిత్ షా చర్చించారు. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో బీజేపీ నిర్వహించాల్సిన కార్యక్రమాల రోడ్ మ్యాప్‌ను అందజేశారు. 119 అసెంబ్లీ సీట్లలో బలమైన అభ్యర్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని, కనీసం 90 సీట్లలో పక్కాగా గెలవడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనతో సామాన్యులు, వివిధ వర్గాల ప్రజలు ఎలా నలిగిపోతున్నారో, కల్వకుంట్ల రాజ్యాంగం ఎలా అమలవుతోందో జనాలకు వివరించాలని అమిత్ షా కోరారు. బీజేపీని బూత్, శక్తి కేంద్రాలు, మండల, నియోజకవర్గ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకోసం ఈ ఏడు నెలలపాటు నిరంతరం పని చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అసమర్థ, అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘హర్ ఘర్ లోటస్’ ప్రోగ్రామ్ ను వెంటనే చేపట్టాలని కోరారు. ‘‘మోడీ సర్కార్ తెలంగాణ కోసం ఎన్ని నిధులు ఇచ్చింది? ఏ పథకం కింద ఎంత ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వ స్కీంలు ఇక్కడ అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటున్నది? పైగా కేంద్రాన్ని బద్నాం చేసే రీతిలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గడప గడపకు తీసుకెళ్లండి. ప్రజలకు వాస్తవాలను వివరించండి’’ అని సూచించారు. రాష్ట్రంలో కొనసాగిస్తున్న
స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లపై, పార్లమెంటరీ ప్రవాసీ యోజన ప్రోగ్రామ్ పై బీజేపీ హైకమాండ్ పూర్తి సంతృప్తితో ఉందని మీటింగ్ తర్వాత రాష్ట్ర నేతలు చెప్పారు.
నడ్డాతోనూ భేటీ
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2. 30 గంటల వరకు సమావేశం సాగింది. అమి త్ షా, నడ్డా.. రాష్ట్ర నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర నేతలు పలు విషయాలను వారి దృష్టికి తీసుకురాగా.. ఓపికతో విన్నారు. తర్వాత అమిత్ షా వెళ్లిపోయినా.. మళ్లీ నడ్డాతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ అనుకూలంగా ఎలా మలుచుకోవాలనే దానిపై నడ్డా దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, అర్వింద్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
మేము కూడా ఊహించ లేదు : డీకే అరుణ
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి
తీసుకువచ్చే విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టారని ఈ మీటింగ్ చూస్తే తమకు అర్థమవుతున్నదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. స్వయంగా అమిత్ షానే ఈ విషయాన్ని మీటింగ్ లో చెప్పారన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చే విషయంలో అమిత్ షా అంత సీరియస్ గా ఉంటారని తాము కూడా ఊహించలేదన్నారు.
నా ధ్యాస అంతా తెలంగాణపైనే ఉంది. ఇది మీకు తెలుసో లేదో. అక్కడి ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. దీన్ని మనకు అనుకూలంగా మలుచుకొని అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించకుండా పని చేయాలి
- అమిత్ షా.
అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తం. ఆ తర్వాత పది ఉమ్మడి జిల్లాల్లో 10 బహిరంగ సభలు పెడ్తం. చివరగా ఒక మెగా సభ ఉంటుంది. దానికి ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్టుగా వస్తరు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎలాంటి చర్చ జరగలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నరు.
- బండి సంజయ్
కాళేశ్వరం అవినీతిని ప్రస్తావించిన వివేక్
రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలనపై అమిత్ షా, నడ్డాల దృష్టికి పలువురు తెలంగాణ నేతలు తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కేసీఆర్ కుటుంబం చేసిన రూ.వేల కోట్ల దోపిడీ గురించి జాతీయ నేతల వద్ద పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వడం లేదని, కేసీఆర్ కుటుంబానికి ఈ ప్రాజెక్టు ఏటీఎంగా పని చేస్తున్నదని షా, నడ్డా దృష్టికి తెచ్చారు.
తెలంగాణకు చంద్రగ్రహణం :పొంగులేటి
తెలంగాణకు చంద్ర గ్రహణం పట్టిందని, ప్రజలు కేసీఆర్ సర్కార్ కు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ తమిళనాడు సహ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఇలాంటి మీటింగ్స్ తరచూ జరుగుతుంటాయన్నారు. గతంలో హైదరాబాద్ లో, ఇప్పుడు ఢిల్లీలోఈ మీటింగ్ జరిగిందన్నారు. హర్ ఘర్ కమల్ కార్యక్రమం చేపడుతున్నామని, ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం పని చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు.
