బీహార్​లో అల్లరి మూకల ఆట కట్టిస్తం : అమిత్​షా

బీహార్​లో అల్లరి మూకల ఆట కట్టిస్తం : అమిత్​షా

పాట్నా : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్​లో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అల్లరి మూకల ఆటలు సాగనివ్వబోమన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), జనతాదళ్​ యునైటెడ్(జేడీయూ) అవినీతి కూటమికి అధికారం మరోసారి దక్కదని చెప్పారు. నవాడా జిల్లాలోని హిసువాలో ఆదివారం జరిగిన సభలో షా మాట్లాడారు. శ్రీరామ నవమి రోజున ససారామ్, బీహార్ షరీఫ్​లో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ససారామ్​లో అమాయక ప్రజలపై బులెట్ల వర్షం కురిపిస్తున్నారని, ఉద్రిక్తతల కారణంగానే తాను అక్కడికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు తాను గవర్నర్​తో మాట్లాడితే.. జేడీయూ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం దేశంలో భాగమేనని, తాను దేశానికి హోం మంత్రిని అనే సంగతి గుర్తుంచుకోవాలని వాళ్లకు సూచించారు.

జేడీయూకి బీజేపీ డోర్లు మూసేసినం

తన కొడుకు తేజస్వీ యాదవ్ బీహార్​కు సీఎం అవుతాడని లాలూ ప్రసాద్ యాదవ్ ఆశిస్తున్నారు కానీ నితీశ్ గురించి ఆయనకు తెలియదని అమిత్ షా అన్నారు. ప్రధాని సీటు దక్కదని తేలిపోయాక తేజస్వీకి అధికారం అప్పగించేందుకు నితీశ్​ ఇష్టపడడని వివరించారు. బీహార్​లో ఈసారి మొత్తం 40 ఎంపీ సీట్లను గెల్చుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జేడీయూకు ఎన్డీయే డోర్లు క్లోజ్​ చేశామని, నితీశ్ పార్టీని మిత్రపక్షంగా అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. ఆయోధ్య రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, తృణమూల్ పార్టీలు వ్యతిరేకించాయని, శంకుస్థాపన చేసి నిర్మించిన ఘనత మోడీకే దక్కుతుందని అమిత్​షా గుర్తుచేశారు.