అసోం టూర్లో బిజీగా హోంమంత్రి అమిత్ షా

అసోం టూర్లో బిజీగా హోంమంత్రి అమిత్ షా

గౌహతి: కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేశారని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పామని పేర్కొన్నారు. సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) తొలగిస్తామని 2019లో కాంగ్రెస్ మాటలు చెప్పిందని ఆయన విమర్శించారు. అసోం రాష్ట్రంలో అమిత్ షా మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రెండో రోజు గౌహతిలో పర్యటించారు. బసిస్తాలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలసి ప్రారంభించారు. 

ఎన్నికల ముందు చెప్పినట్లే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించి శాంతిని నెలకొల్పి నిజమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అమిత్ షా వివరించారు. ఇందిరాగాంధీ ఈశాన్యరాష్ట్రాల్లో రక్తం పారించారని ఆయన ఆరోపించారు. విద్యార్థి ఉద్యమంలో భాగంగా చాలా సార్లు అసోం వచ్చానని.. కానీ బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని ఆనాడు ఊహించలేదన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ దేశంలో సిద్ధాంత ఆధారంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని  అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అసలు సిద్ధాంతాలు ఉన్నాయా ?  అని నడ్డా  ప్రశ్నించారు.