Delhi Services Bill : ఆగస్టు 7న రాజ్యసభకు ఢిల్లీ సర్వీసుల బిల్లు.. ఆప్‌, కాంగ్రెస్‌ విప్ జారీ

Delhi Services Bill : ఆగస్టు 7న రాజ్యసభకు ఢిల్లీ సర్వీసుల బిల్లు.. ఆప్‌, కాంగ్రెస్‌ విప్ జారీ

Delhi Services Bill : ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సోమవారం (ఆగస్టు 7న) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఢిల్లీకి సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని, దీనిపై ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా.. అవి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని అమిత్‌షా లోక్‌సభలో బిల్లు ప్రవేశపెడుతూ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును జులై 25న కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

మరోవైపు.. ఆమ్ ఆద్మీ తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆగస్టు 7, 8 తేదీల్లో సభకు హాజరు కావాలని కోరుతూ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఢిల్లీ బ్యూరోక్రసీపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణను ఇచ్చే ఆర్డినెన్స్‌ను భర్తీ చేయడానికి ఉద్దేశించిన వివాదాస్పద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు రాజ్యసభలో చర్చకు, ఆమోదానికి రానున్నందున ఆప్‌ సభ్యులు తమ వైఖరిని తెలియజేయాలని విప్ జారీ చేసింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆదేశించింది. 

ఈ బిల్లుపై ఆప్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా సోమవారం (ఆగస్టు 7న) హాజరు కావాలని తమ రాజ్యసభ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. విపక్షాల వాకౌట్ మధ్య, దాదాపు ఐదు గంటల చర్చ తర్వాత బిల్లును గురువారం ( ఆగస్టు 3న) లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజ్యసభకు బిల్లు వచ్చే సమయంలో దీనిని వ్యతిరేకించాలంటూ గత రెండు నెలలుగా కేజ్రీవాల్ విపక్ష నేతలను కలుసుకుని మద్దతు కోరుతున్నారు. 

రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడితే.. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభలో ప్రతిపక్షం వైపు నుంచి చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. అభిషేక్ మను సింఘ్వీ కూడా ఢిల్లీ ప్రభుత్వం తరపున ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదించారు.