
- రేపు అమిత్ షా రాక
- ఆదిలాబాద్ సభలో పాల్గొననున్న కేంద్ర హోం మంత్రి
- సికింద్రాబాద్‌లో మేధావుల సభకు హాజరు
- శంషాబాద్ నోవాటెల్‌లో పార్టీ నేతలతో మీటింగ్
- బీజేపీ ఫస్ట్ లిస్ట్..15 లేదా 16న
హైదరాబాద్, వెలుగు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరగనున్న మేధావుల సదస్సుకు హాజరు కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని, అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి, 3 గంటలకు ఆదిలాబాద్‌కు చేరుకుంటారు. 4 గంటలకు వరకు అక్కడ జరిగే జన గర్జన సభలో పాల్గొని, మాట్లాడతారు. ఆ తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 5.15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు.
ALSO READ :- సిరిసిల్లలో సర్కార్ భూముల్లో వెంచర్.. 20.87ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్న బల్దియా
అక్కడే 45 నిమిషాల పాటు పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత నోవాటెల్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో బీజేపీ లీగల్ సెల్ ఏర్పాటు చేసిన మేధావుల సదస్సులో షా పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు హోటల్‌కు చేరుకొని, మళ్లీ పార్టీ నేతలతో రెండోసారి సమావేశం కానున్నారు. తర్వాత రాత్రి 9.15కు నోవాటెల్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
రాజేంద్ర నగర్ సభ రద్దు..
షెడ్యూల్ ప్రకారం ఆదిలాబాద్ మీటింగ్ తర్వాత రాజేంద్రనగర్‌లో జన గర్జన సభకు అమిత్ షా అటెండ్ కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ మీటింగ్ రద్దయింది. ఈ మీటింగ్ ప్లేస్‌లో మేధావుల సభను పార్టీ నేతలు ఖరారు చేశారు. మేధావుల సదస్సును సక్సెస్ చేయడంపై ఆదివారం సాయంత్రం పార్టీ స్టేట్ ఆఫీసులో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులతో కేంద్ర మంత్రి, పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వానించాలని, బీజేపీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండాలనే దానిపై చర్చించారు. మేనిఫెస్టోలో ఇంటిలెక్చువల్స్ నుంచి అమిత్ షా సలహాలు, సూచనలు తీసుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అమిత్ షా ఆదిలాబాద్ సభకు భారీ జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ , నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కరీంనగర్ ఎంపీ సంజయ్‌లు.. ఆయా జిల్లాల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు సభకు తరలి రావాలని కోరుతున్నారు.
బీజేపీ ఫస్ట్ లిస్ట్.. 15 లేదా 16న
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 15 లేదా 16వ తేదీన పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది. మొత్తం 38 మందితో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14న అమావాస్య ముగియగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ జాబితాలో బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు.