ఎంపీ అనుచరుడిని అంటూ అమిత్ షా చుట్టూ చక్కర్లు

ఎంపీ అనుచరుడిని అంటూ అమిత్ షా చుట్టూ చక్కర్లు

కేంద్ర హోం మంత్రి ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. సోమవారం ముంబైలో అమిత్‌ షా పర్యటించారు. ఈ సమయంలో  హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమిత్‌ షా వెంట ఓ వ్యక్తి తిరగడం కలకలం రేపింది. అతన్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆంధ్రాకు చెందిన  ఓ ఎంపీ పర్సనల్ సెక్రటరీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

అమిత్ షాకు దగ్గర్లో చక్కర్లు..
సోమవారం కేంద్ర హోం మంత్రి ముంబైలో పర్యటించారు. మొత్తం మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. బీజేపీ నేతలతో సమావేశమై పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చించారు. బుధవారం అమిత్ షా పర్యటన ముగిసింది.  అయితే  ఈ పర్యటనలో  భద్రతా వైఫల్యాన్ని అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. కొన్ని గంటల పాటు అమిత్‌ షాకు దగ్గర్లోనే తిరిగాడు.  అయితే అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబై పోలీసులకు సమాచారం అందించారు. అతడి పేరు  హేమంత్‌ పవార్‌గా గుర్తించారు. భద్రతా సిబ్బంది బృందంలో ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. హేమంత్ పవార్‌పై ఐపీసీ 170, 171 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కస్టడీకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని విచారించగా..ఏపీ ఎంపీ అనుచరుడినని చెప్పినట్లు అధికారులు తెలిపారు. 

 

నిషేధిత ప్రాంతాల్లో తిరగడంతో అనుమానం
అమిత్ షా పర్యటన కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ముంబై ఏసీపీ నీల్ కాంత్ పాటిల్ తెలిపారు. గిర్గావ్ చుట్టూ పోలీసులతో బందోబస్తు నిర్వహించామన్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇండ్లను సందర్శించినప్పుడు..మలబార్ కు వెళ్లేందుకు సిద్ధమైన మార్గంలో పోలీసులను మోహరించామని..ఆ సమయంలో తాను పర్యవేక్షించినట్లు చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వైట్ షర్ట్, బ్లూ బ్లేజర్ ధరించిన వ్యక్తిని తాను గమనించినట్లు వెల్లడించారు. అతను కేంద్ర హోంమంత్రిత్వ శాక ఐడీకార్డును ధరించాడని..అయితే నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతుండంతో అనుమానం వచ్చిందన్నారు. కొన్ని గంటల తర్వాత సీఎం షిండే నివాసం బయట చూశానని..అప్పుడే అనుమానం బలపడటంతో..విచారించామన్నారు. తన పేరు హేమంత్ పవార్ అని..తాను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సభ్యుడినని పేర్కొన్నట్లు నీల్ కాంత్ పాటిల్ వెల్లడించారు. 

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి అమిత్ షా ముంబైలో పర్యటించారు.