లోక్ సభలో నారీ శక్తి వందన్

లోక్ సభలో నారీ శక్తి వందన్
  • లోక్ సభలో నారీ శక్తి వందన్
  • మహిళా రిజర్వేషన్  బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్
  • 128వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు చట్టసభల్లో 33శాతం స్థానాలు
  • బిల్ పాసైతే ఎంపీలుగా 181 మందికి, తెలంగాణలో 40 మందికి  ఎమ్మెల్యేలుగా చాన్స్!

ఢిల్లీ : చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ఉద్దేశించిన ‘ నారీశక్తి వందన్’ బిల్లును ఇవాళ  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 128వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆయన పార్లమెంటుకు వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే లోక్ సభలో మహిళా ఎంపీల సంఖ్య 181కి  పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీలో మహిళా సభ్యుల సంఖ్య 40కి చేరే అవకాశం ఉంది. కొత్త పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు నారీ శక్తి వందన్  కావడం గమనార్హం.  ఈ బిల్లు ప్రవేశపెట్టిన కాసేపటికి లోక్ సభ రేపటికి వాయిదా పడింది. దీనిపై రేపు చర్చజరగనుంది. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభలోనూ దీనిపై చర్చ జరగనుంది. అనంతరం బిల్లు పాస్ అయ్యాక చట్టంగా మారుతుంది. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత 2027 లేదా 2030 నుంచి మహిళా రిజర్వేషన్ అమలవుతుందని కేంద్రం డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది. కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి చట్టం ఇదే కావడం గమనార్హం. 

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే? 

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33% సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలనేది  ప్రతిపాదన. ఈ 33% కోటాలో ఎస్సీ,  ఎస్టీలు, ఆంగ్లో -ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా ప్రవేశ పెడతారు. రిజర్వ్డ్ సెగ్మెంట్లలోనూ 33% సీట్లను మహిళలకు కేటాయిస్తారు.  ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అయితే ఇందులో బీసీలకూ రిజర్వేషన్లు కేటాయించాలని ఓబీసీ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు  ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు.  

1996లో తొలిసారి  

హెచ్ డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సెప్టెంబర్ 12, 1996న 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో తొలిసారిగా దీనికి ప్రవేశపెట్టగా ఆమోదం  పొందలేదు.  రెండేళ్ల తరువాత, అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998లో 12వ లోక్‌సభలో బిల్లును  ప్రవేశపెట్టింది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి 1998లో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని తన వాణిని వినిపించారు.  అప్పుడు  కూడా బిల్లుకు తగిన మద్దతు లభించలేదు. దీంతో లాప్ అయ్యింది. ఇదే వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టినా కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో పాస్‌ కాలేదు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని సర్కిరు మే 6, 2008న రాజ్యసభలో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లు  ప్రవేశపెట్టింది. మే 9, 2008న బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. ఈ నివేదికకు 2010, ఫిబ్రవరిలో  కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర లభించింది. చివరికి మార్చి 9, 2010న మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 186-1 ఓట్లతో ఆమోదం పొందింది. అయితే, లోక్‌సభలో మాత్రం   ఎప్పుడూ పరిశీలనకు రాలేదు. 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో అక్కడితో ముగిసిపోయింది. ఆ సమయంలో ఆర్జేడీ -సమాజ్‌వాదీ పార్టీలు మహిళలకు కులాల  వారీగా రిజర్వేషన్లు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. 

పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ఎంత? 

17వ లోక్‌సభలో ఇప్పటివరకు అత్యధికంగా 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఇది మొత్తం లోక్‌సభ బలంలో దాదాపు 15.21 శాతం. 2022లో ప్రభుత్వ డేటా ప్రకారం  రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 14 శాతం. 2014లో అంటే 16వ లోక్‌సభలో మొత్తం 11.87 శాతం అంటే 68మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019 లోక్‌సభ  ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో, పురుషుల భాగస్వామ్యం కంటే 67.18 శాతం  మహిళా  ఓటరు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. 

181మంది మహిళా ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలు 

మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే లోక్ సభలో 181 మంది మహిళా ఎంపీలుంటారు. ప్రస్తుతం 82 మంది ఎంపీలున్నారు. వారి సంఖ్య రెట్టింపును దాటే అవకాశం ఉంటుంది. అందులోనూ ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్లు కల్పిస్తారు. అలాగే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలున్నాయి. ఇందులో 40 మంది మహిళలకు అవకాశం లభిస్తుంది. ఇక్కడా అదే విధంగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు.