- గణేశ్ నిమజ్జనానికి కాలువల్లో నీరు విడుదల చేయాలి: బండి సంజయ్
సిరిసిల్ల టౌన్, వెలుగు: ప్రైవేట్ భూముల విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఎవరు ఇచ్చారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ వాహనాలు, పోలీస్ బందోబస్తుతో ప్రైవేట్ భూముల వద్దకు వెళ్లి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. శుక్రవారం సిరిసిల్లలో పర్యటించిన బండి సంజయ్ పలు గణేశ్ మండపాలను సందర్శించారు.
నిమజ్జన ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సిరిసిల్ల నియోజకవర్గంలో వేల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం చెబుతున్నారని, నిజంగా అంత పెద్ద మొత్తంలో భూములు అన్యాక్రాంతమై ఉంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. పది వేల ఎకరాలా.. లక్ష ఎకరాలా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి అవగాహన ఉందని ఆరోపించారు. గణేశ్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని కోరారు. కాల్వల్లో నీరు లేకపోవడంతో నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. నీరు, రహదారులు, విద్యుత్, పోలీస్ బందోబస్తు, వైద్య సదుపాయాలతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు.
