9 నెలల్లో కాంగ్రెస్ చేసిందేంది?

9 నెలల్లో కాంగ్రెస్ చేసిందేంది?
  • ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయలేదు: సంజయ్ .

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9 నెలలైనా, ఆరు గ్యారంటీలను కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. ఈ 9 నెలల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని, లేదంటే ప్రజలు ఆ పార్టీని క్షమించరని అన్నారు.

మంగళవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడారు. మోదీ 100 రోజుల పాలనలో రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. ఇందులో భాగంగా కనీస మద్దతు ధర పెంపు కోసం రూ.2 లక్షల కోట్లు కేటాయించినం.

పీఎం కిసాన్ నిధి ద్వారా 9.30 కోట్ల మంది ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ చేసినం. మహిళల కోసం ‘నారీ శక్తి’ కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించినం. 4.30 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన 26 లక్షల మందికి రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను విడుదల చేసి ప్రయోజనం చేకూర్చినం. ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినం’’అని వివరించారు.

రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ‘‘75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేశాం. యువతకు లాభం చేకూర్చేందుకు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాం. సీనియర్ సిటిజన్లకు కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ 6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తున్నాం” అని తెలిపారు.