భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్‌లో కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రూ. 51వేల కోట్ల బకాయిలు గుదిబండగా మారాయని, కొత్త మైన్స్ రాకపోవడతో సింగరేణి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణికి పర్మినెంట్ సీఎండీ ఉండాలని, సత్తుపల్లి, కోయగూడెం కోల్ బ్లాక్‌లను సింగరేణికి ఇచ్చేలా ప్లాన్ చేయాలన్నారు. నైనీ ప్రాజెక్టులో కోల్ ట్రాన్స్‌పోర్టుకు క్లియరెన్స్ ఇచ్చేలా చూడాలని కోరారు. మణుగూరు ఓసీ ఎక్స్టెన్షన్ వేలంలో కాకుండా సింగరేణికే ఇవ్వాలన్నారు. సింగరేణి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. కోల్ ఇండియాలో మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించేలా చూడాలన్నారు.
కొత్తగూడెంకు విమానశ్రయం వచ్చేలా చూడాలని, కొత్త మైన్స్‌తో సింగరేణి కళకళలాడాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మంత్రిని కోరారు. సింగరేణిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంత్రికి వినతిపత్రం ఇచ్చారు.
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, కే. సారయ్య, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మందా నర్సింహరావు, బీఎంఎస్ సెక్రటరీ మాధవ్ నాయక్, యాదగిరి సత్తయ్య, యూనియన్ నేతలు పాల్గొన్నారు.
కొండపల్లి రాఘవ రెడ్డికి పరామర్శ
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఖమ్మం స్తంబాద్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తండ్రి కొండపల్లి రాఘవ రెడ్డిని మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు ఉన్నారు.
