రాంజీ గోండు, కొమురం భీమ్ చరిత్ర ఇప్పటి తరానికి చెప్పాలి: కిషన్ రెడ్డి

రాంజీ గోండు, కొమురం భీమ్ చరిత్ర ఇప్పటి తరానికి చెప్పాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు బ్రిటీష్​వాళ్లు, నిజాం, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు రాంజీ గోండు, కొమురం భీమ్ చరిత్రను ఇప్పటి తరానికి తెలియజెప్పాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్​లోని అబిడ్స్​లో రాంజీ గోండు స్మారక ట్రైబల్ మ్యూజియం శంకుస్థాపనలో ఆయన రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అర్జున్ ముండా వర్చువల్​గా మ్యూజియానికి శంకుస్థాపన చేశారు.

తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడి బలిదానం చేసిన వారిలో గిరిజన బిడ్డలే ఎక్కువన్నారు. వారి చరిత్ర నేటి తరానికి చెప్పేలా దేశమంతటా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే దేశమంతటా 10 ట్రైబల్ మ్యూజియంల ఏర్పాటుకు 2018లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ట్రైబల్ మ్యూజియాన్ని ఈ మధ్యే ప్రారంభించామని చెప్పారు. తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు భూమి కేటాయించాలని పదే పదే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరినా వారు స్పందించలేదని మండిపడ్డారు.

మ్యూజియం ఏర్పాటు గిరిజనులకు గర్వకారణం

రాంజీ గోండు పేరిట రాష్ట్రంలో మ్యూజియం ఏర్పాటు చేయడం గిరిజనులకు గర్వకారణమని కిషన్​రెడ్డి అన్నారు. భగవాన్ బిర్సా ముండా జయంతి అయిన నవంబర్ 15వ తేదీని ‘నేషనల్ ట్రైబల్ డే’గా మోదీ ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ‘‘రాష్ట్రంలోని ములుగులో ట్రైబల్ యునివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ఆమోదించినం. వర్సిటికీ సమ్మక్క–-సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాం. ఈ ఏడాదే క్లాసులు ప్రారంభించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. మొదటి విడతలో రూ.900 కోట్లు కేటాయించారు. మాసబ్ ట్యాంకులో రూ.6.5 కోట్ల నిధులతో ట్రైబల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ ప్రారంభించినం. గిరిజనుల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం కోసం రూ.420 కోట్లతో రాష్ట్రంలో 17వ ఏకలవ్య ఇన్​స్టిట్యూట్​లను ప్రారంభించాం. గూడేలా, తండాల అభివృద్ధికి రూ.25 వేల కోట్లతో ‘ప్రైం మినిస్టర్ జన్మం’ స్కీం మోదీ ప్రారంభించారు. భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాలలోని గిరిజనుల అభివృద్ధికి  కేంద్ర స్పెషల్​డెవలప్​మెంట్ ఫండ్స్ ఇస్తుంది’’ అని అన్నారు.

రాంజీ గోండు, కొమురం భీమ్ పోరాటం మరువలేనిది: సీతక్క

జల్ జంగిల్ జమీన్ పోరాటంలో రాంజీ గోండు, కుమ్రం భీమ్  చరిత్ర మరువలేనిదని మంత్రి సీతక్క అన్నారు. వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు వారి చరిత్రను అందించిన వాళ్లమైతామన్నారు. ఈ సందర్భంగా మేడారం జాతర, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, యునెస్కో రామప్ప పనులకు సంబంధించి నిధులను కేటాయించాలని కేంద్రమంత్రికి సీతక్క విజ్ఞప్తి చేశారు.