మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు 

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరు 
  • సభా ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి
  • రేపటి సభకు హాజరుకానున్న అమిత్ షా 

మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, నియోజకవర్గం ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ వస్తాయని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. విలువలకు కట్టుబడి ఉన్న రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఓటర్లు గెలిపిస్తారని, ఇక్కడి ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభద్రతా భావంతో ఉందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు గానీ అధికార పార్టీ మాత్రం గందరగోళంలోనే ఉందన్నారు. అమిత్ షా మీటింగ్ కు ఒకరోజు ముందు కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారంటే.. వారిలో ఎంతో భయం ఉందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం మునుగోడులో కుర్చీ వేసుకొని కూర్చున్నా టీఆర్ఎస్ గెలవదన్నారు.

అభివృద్ధి ఎక్కడ..? 
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపును ఓర్వలేక తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు కేసీఆర్ చాలా ఎత్తులు వేశారని, కొత్త పథకాలను కూడా అప్పటికప్పుడు పుట్టుకొచ్చాయన్నారు. మాయమాటలతో ప్రజలను గారడీ చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదని, తమ పార్టీలో అవినీతి లేదని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని బీజేపీతో పాటు ప్రజలందరూ అభినందిస్తున్నారని చెప్పారు. రాష్ర్టంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని, మిగతా నియోజకవర్గాల్లో మాత్రం అభివృద్ధి లేదన్నారు. అధికార పార్టీ నాయకుల ఫామ్ హౌజ్ లు, వాళ్లు పర్యటించే ప్రాంతాల్లోనే అభివృద్ధి ఉంటోందని, మిగతా నియోజకవర్గాలు రాష్ర్టంలో లేవా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శమని చెబుతున్న ఆ పార్టీ నాయకులు ఎందులో ఆదర్శమో చెప్పాలని డిమాండ్ చేశారు.

రేపు మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. పార్టీ నాయకులతో కలిసి సభా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అమిత్ షా సభకు ఇన్ చార్జ్ గా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు.