కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే : కిషన్ రెడ్డి

భారతమాత హత్య అంటూ రాహుల్ గాంధీ దుందుడుకుగా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. వందల ఏళ్లుగా దేశ సంస్కృతినీ, గౌరవాన్ని, చరిత్రను మంటగలిపేందుకు మొఘలులు మొదలు చైనా వరకు అనేకమంది ప్రయత్నాలు చేశారని చెప్పారు. భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలెవరూ హర్షించరన్నారు. భారతమాతను, హిందూస్తాన్ ను ఎవరూ హత్య చేయలేరని చెప్పారు. రాజకీయంగా విమర్శలు చేయాలి తప్ప.. ఇలా మాట్లాడటం సరికాదని తప్పుపట్టారు. 

సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని స్వయంగా కేటీఆరే చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలుస్తామని కేటీఆరే చెప్తున్నారని అన్నారు. రెండు పార్టీలు ఒక్కటే అన్న విషయంపై ప్రజలకు స్పష్టత వచ్చిందన్నారు. కలిసి ధర్నాలు చేయడం, కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎంఐఎం రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం చర్చలు జరుపుతోందన్నారు. 

గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పని చేశాయని చెప్పారు కిషన్ రెడ్డి. 2014లో 22 మంది కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే అందులో 15 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారని చెప్పారు. 2018లోనూ 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిస్తే 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరి.. మంత్రులుగా కొనసాగుతున్నారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల బాధ్యత తీసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే అని చెప్పారు. 

మజ్లిస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పార్టీ అయ్యిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 100 కోట్ల హిందువుల సంగతి చూస్తామని, హైదరాబాద్ లో మత ఘర్షణలకు కారణమైన మజ్లిస్ పార్టీ ఎలా సెక్యులర్ పార్టీ అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేసినట్లేనని, కాంగ్రెస్ కు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని చెప్పారు. రెండింటికీ ఓట్లు వేస్తే మజ్లిస్ పార్టీని బలపర్చినట్లేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన పోవాలన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు అమలు కావాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు.

కాంగ్రెస్,  బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డ్రామాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కు 40కి పైగా ఉత్తరాలు రాస్తే.. ఒక్కదానిపైనా సమాధానం ఇవ్వలేదన్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే 2009 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశామని వివరణ ఇచ్చారు. తాము ఎప్పుడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలేదన్నారు. పొత్తు పెట్టుకోవడం వేరు.. ఓటు వేయడం వేరు అని చెప్పారు.