అసెంబ్లీలో ఈటల మీ గుండె చప్పుడైతడు

అసెంబ్లీలో ఈటల మీ గుండె చప్పుడైతడు
  • గెల్లు గెలిచినా.. కేసీఆర్ కుటుంబానికి బానిసే: కిషన్ రెడ్డి
  • కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో తెలంగాణ బందీ
  • హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి

కరీంనగర్, వెలుగు: ‘‘ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కలిగిన వ్యక్తి. కేసీఆర్ లెక్క ధనవంతుడు కాకపోవచ్చు.. కానీ ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి. మీ కష్టసుఖాల్లో ఒకడిగా ఉంటాడు. అసెంబ్లీలో మీ గుండె చప్పుడైతడు. మీ సమ-స్యలపై స్పందించే మనిషి కావాల్నా..  కేసీఆర్ కుటుంబానికి బానిసగా ఉండే వ్యక్తి కావాల్నా ఆలోచించండి’’ అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం జమ్మికుంట మండలం వావిలాల, నాగంపేట, కోరపల్లి, మడిపెల్లి, జమ్మికుంట టౌన్లలో కిషన్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈటల ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతానికి సేవ చేశారన్నారు. రాజకీయాల్లో కిందిస్థాయి నుంచి ఎదిగివచ్చిన రాజేందర్​పై కక్షగట్టిన కేసీఆర్ అతనితో పాటు ఫ్యామిలీపై కేసులు పెట్టి జైలుకు పంపాలని చూశారని, ఎన్నికల తర్వాత కూడా కక్షసాధింపు కొనసాగిస్తారన్నారు. నిజాయితీపరుడైన ఈటలను రాజకీయాల నుంచి దూరం చేసేందుకు కోట్లు కుమ్మరిస్తున్నారని విమర్శించారు.

ఈసీ రూల్స్ ఏ పార్టీకైనా ఒకటే
టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహులకు, ఉద్యమ వ్యతిరేకులకు అడ్డాగా మారిందని కిషన్​రెడ్డి ఫైరయ్యారు. ఉద్యమంలో స్టూడెంట్ల మీద  కేసులు పెట్టి వేధించిన వాళ్లే ఇప్పుడు కేసీఆర్​ చుట్టూ ఉన్నారన్నారు. ఈటలకు ఎవరూ అండగా ఉండకుండా నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలను టీఆర్​ఎస్​ వాళ్లు కొంటున్నారని చెప్పారు. డబ్బు వెదజల్లి హుజూరాబాద్ ప్రజలకు కొనాలని కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని, తాము డబ్బులకు అమ్ముడుపోని బిడ్డలమని నిరూపించాలన్నారు. ఎన్నికల సభలు పెట్టుకోకుండా అడ్డుపడ్డారంటూ తమపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమకైనా, కేసీఆర్​కైనా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒకటేనన్నారు. ఏడున్నరేండ్ల కాలంలో ఒక్కరోజూ కేసీఆర్ సెక్రటేరియట్​పోలేదని, ఇదేం పాలన అని అందరూ అడుగుతున్నారనే సెక్రటేరియట్​నే కూలగొట్టారన్నారు.  

1,400 మంది బలిదానంతో ప్రత్యేక రాష్ట్రం 
హుజూరాబాద్ ఎన్నిక కౌరవులకు, పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, ఆత్మగౌరవానికీ,  అహంకారానికీ నడుమ... ప్రజస్వామ్యానికీ, కుటుంబపాలనకూ మధ్య జరుగుతున్న ఎన్నికలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఊరికే రాలేదని, ఆందరూ కలిసి పోరాడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెచుకున్నామని గుర్తుచేశారు.  శ్రీకాంతాచారి లాంటి 1,400 మంది ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో బందీ అయిందని, వారి నుంచి విముక్తి చేయాల్సిన టైమ్​ వచ్చిందన్నారు. కొడుకుకు మంత్రి పదవి, కూతురుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకునేందుకు 1,400 మంది బలిదానం చేసుకోలేదన్నారు.