మోదీ హ్యాట్రిక్​ పక్కా.. జూన్​లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ ​భారత్ ​యాక్షన్​ ప్లాన్​: కిషన్​రెడ్డి

మోదీ హ్యాట్రిక్​ పక్కా.. జూన్​లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ ​భారత్ ​యాక్షన్​ ప్లాన్​: కిషన్​రెడ్డి
  • రాబోయే ఐదేండ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా
  • 3 దశాబ్దాల తర్వాత దేశంలో మోదీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం 
  • కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు లేని భారతాన్ని నిర్మించాం
  • ప్రపంచంలో పాకిస్తాన్​ను ఏకాకిని చేశామని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: జూన్​లో హ్యాట్రిక్​ ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోందని చెప్పారు.  రాబోయే ఐదేండ్లలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా.. ఏ సంక్షోభం వచ్చినా 140 కోట్లమంది ప్రతినిధిగా మోదీ ఏం చెప్తారోనని నేడు ప్రపంచం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని అన్నారు.  

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మేనిఫెస్టో తెలుగు వెర్షన్​ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​తో కలిసి కిషన్​రెడ్డి రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడారు. జూన్ రెండో వారంలో మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత వికసిత్​ భారత్ ప్రణాళికను ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు.  

రాబోయే రోజుల్లో లక్షల కోట్లు ఖర్చు తగ్గించేందుకు  ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ పేరుతో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.  మూడు దశాబ్దాల తర్వాత దేశంలో ఓ సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, 95% ఉగ్రవాదం తగ్గిందని తెలిపారు. కర్ఫ్యూలు, బాంబు పేలుళ్లు లేని భారత్​ను నిర్మించినట్టు చెప్పారు. ప్రపంచంలో పాకిస్తాన్​ను ఏకాకిని చేశామన్నారు. వచ్చే ఐదేండ్లలో మూడు కోట్ల ఇండ్లు కట్టిస్తామని, దేశాన్ని విశ్వగురువుగా ముందుకు తీసుకుపోతామని చెప్పారు.

వెయిటింగ్ లిస్టులు తగ్గించేందుకు గానూ రైల్వేల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొత్తతరం రైళ్లను తీసుకొస్తామని తెలిపారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని, ప్రజలకు ఇచ్చే మోదీ గ్యారంటీ అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(టీఎస్​పీఎస్సీ) నిరుద్యోగులకు ఉరిగా మారిందని అన్నారు. పేపర్​ లీకేజీలను అరికట్టేందుకు తాము కఠిన చట్టాలను తీసుకొస్తామని చెప్పారు.

ఇది మోదీ గ్యారంటీ: లక్ష్మణ్ 

బీజేపీ ప్రవేశపెట్టిన సంకల్ప పత్రంను మోదీ గ్యారంటీగా ప్రజలు విశ్వసిస్తున్నారని లక్ష్మణ్​పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతూ.. విభజిత్ భారత్​గా మార్చాలని కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.  యూపీఏ హయాంలో రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయని, నాటి యూపీఏ ఇప్పుడు కొత్తగా ఇండియా కూటమి పేరుతో ముందుకొచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేతలు కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్ రెడ్డి, మాధవి, ప్రేమేందర్ రెడ్డి, రచనారెడ్డి పాల్గొన్నారు.